NMDC: ఎన్‌ఎండీసీ శాశ్వత చైర్మన్ నియామకమెప్పుడో?
ABN , Publish Date - Jul 16 , 2024 | 04:23 AM
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) కు శాశ్వత చైర్మన్ నియామకంపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్న అమితవ ముఖర్జీనే రెండో పర్యాయం కూడా కొనసాగిస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
అమితవ ముఖర్జీనే రెండోసారి ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తూ నిర్ణయం
తెలంగాణ నుంచి ఎన్.శ్రీధర్ పేరును తిరస్కరించిన ఏసీసీ
హైదరాబాద్, జూలై 15(ఆంధ్రజ్యోతి): జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) కు శాశ్వత చైర్మన్ నియామకంపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్న అమితవ ముఖర్జీనే రెండో పర్యాయం కూడా కొనసాగిస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 2022 మార్చిలో తొలిసారి పొడిగించింది. తాజాగా ఈ ఏడాది నవంబర్ 19 వరకు ఆయనే ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగనున్నట్లు తెలిపింది. మేజర్ మైనింగ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయనకే సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
గత మార్చిలో సీఎండీ పోస్టులో తెలంగాణకు చెందిన ఐఏఎస్ నడిమట్ల శ్రీధర్‌ను నియమించేందుకు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సిఫార్సు చేసింది. అయితే క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది జూన్ 30న జరిగిన క్యాబినెట్ నియామకాల కమిటీ సమావేశంలో సీఎండీ నియామకాల కోసం వచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్‌ఎండీసీ చైర్మన్ కమ్ సీఎండీ నియామకానికి సంబంధించి మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. సింగరేణి సీఎండీగా శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల వల్లే ఎన్‌ఎండీసీ సీఎండీ నియామకానికి ఆటంకంగా మారాయనే ప్రచారం జరిగింది.
ముఖర్జీపై ఆరోపణలు..
ప్రస్తుతం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్న అమితవ ముఖర్జీపై పలు ఆరోపణలున్నాయి. ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న ఎన్‌ఎండీసీ ప్రాంతీయ కార్యాలయాన్ని మూసివేయించారని, అక్కడ కార్యాలయం లేకున్నా సిబ్బంది కొనసాగడం, గతంలో 35రోజులు కార్మికులు సమ్మె చేస్తే దాని వల్ల కార్పొరేషన్‌కు సుమారు రూ.500 కోట్ల నష్టం వాటిల్లడానికి ఆయన నిర్ణయాలే కారణమనే ఆరోపణలూ వచ్చాయి. ఏదేమైనా ఏసీసీ శాశ్వత చైర్మన్ నియామకం చేపడితే తప్ప ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ముఖర్జీ తప్పుకొనే పరిస్థితి లేదు.