హై రయ్.. రయ్
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:16 AM
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ కారిడార్లు.. తెలంగాణలో 6-7.. ఏపీలో 9
పోర్ట్ అనుసంధాన రోడ్లు, మిస్సింగ్ లింక్, రద్దీ ఉండే చోట్ల రోడ్ల నిర్మాణాలు కూడా..
విజన్-2047 కింద దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు
స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ రోడ్లు, పట్టణాల్లోని ఇరుకు రహదారుల విస్తరణ సైతం..
రెండు దశల్లో 59 వేల కిలోమీటర్ల మేర..
భవిష్యత్తులో ఏర్పడే ట్రాఫిక్‌కు అనుగుణంగానే కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక పనులు
తెలంగాణకు రాబోయే
హైస్పీడ్ కారిడార్‌లు
190 కి.మీ.
హైదరాబాద్- బెంగళూరు
83 కి.మీ.
హైదరాబాద్- చెన్నై
244 కి.మీ.
హైదరాబాద్- విశాఖపట్నం
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా హైస్పీడ్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ, స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, లింక్, ఫీడర్ రోడ్లన్నింటినీ కలిపి దాదాపు 59 వేల కిలోమీటర్ల మేర నిర్మాణాలను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. విజన్-2047లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు ప్రాజెక్టులు మంజూరు కానున్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం ఏపీ, తెలంగాణ మీదుగా పలు హై స్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ఏపీలో పోర్టులు ఉండడంతో వాటిని అనుసంధానించేలా పలు రహదారులు, రెండు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతోపాటు మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మించనున్నారు.
స్ట్రాటజికల్, ఇంటర్నేషనల్ రోడ్ల కనెక్టివిటీ కింద తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోడ్డు లేకపోవడం గమనార్హం. హైస్పీడ్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్‌కు 9, తెలంగాణకు 6-7 (తెలంగాణ మీదుగా ఏపీకి కొన్ని రోడ్లున్నాయి) రానున్నాయి. ఏపీలో పోర్టు కనెక్టివిటీ రోడ్లు 8 వరకు ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లోని ఇరుకు రోడ్లను వెడల్పు చేసే ప్రాజెక్టులు ఏపీలో 4, తెలంగాణలో 3 చోట్ల ఉన్నాయి. మిస్సింగ్ లింక్, అఽధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేపట్టే రహదారుల నిర్మాణాల ప్రాజెక్టుల్లో ఏపీకి 7, తెలంగాణకు 4 చొప్పున ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ రెండు దశల్లో నిర్మించనున్నారు. కేంద్ర క్యాబినెట్‌లో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించిన తర్వాత నిర్మాణ వ్యయం, భూ సేకరణ, రూట్‌మ్యా్‌పలపై స్పష్టత రానుంది.
రెండు దశల్లో నిర్మాణాలు..
దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి రోడ్లను నిర్మించాలి? ఏయే రాష్ట్రాల గుండా హైస్పీడ్ కారిడార్ల నిర్మాణాలు చేపడితే బాగుంటుంది? వంటి అంశాలపై సర్వే చేసే బాధ్యతల్ని కేంద్రం ఓ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ప్రాథమిక సర్వే నిర్వహించి.. దేశంలోని పలు రాష్ట్రాలు, జిల్లాల మీదుగా నిర్మించాల్సిన హైస్పీడ్ కారిడార్లు, పోర్టులకు కనెక్టివిటీలు, జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రదేశాల నుంచి గ్రీన్‌ఫీల్డ్, హై స్పీడ్ కారిడార్లకు అనుసంధానం చేసే ఫీడర్ రోడ్లతో పాటు స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ రోడ్లకు సంబంధించిన నివేదికను కేంద్రానికి అందించింది. దాని ప్రకారం.. హైస్పీడ్ కారిడార్లు తొలి దశలో 18 వేల కి.మీ., రెండో దశలో 20 వేల కి.మీ. కలిపి 39 వేల కి.మీ., ఫీడర్లు, స్పర్ రోడ్లు 6 వేల కి.మీ., పోర్టు కనెక్టివిటీ రోడ్లు 2,500 కి.మీ., పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న రోడ్ల వెడల్పుకు సంబంధించి 4 వేల కి.మీ., స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ రోడ్ల కింద దాదాపు 3 వేల కి.మీ., ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న చోట, హైవేల్లో మిస్సింగ్ లింక్‌ల కింద దాదాపు 2 వేల కిలోమీటర్లు కలిపి దేశవ్యాప్తంగా రెండు దశల్లో 59 వేల కిలోమీటర్లను నిర్మించాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుత ట్రాఫిక్, భవిష్యత్తులో పెరగబోయే రద్దీని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టుల పనులు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రారంభించాలని, అనంతరం ఏటా ఆయా పనులకు అవసరమైన అనుమతులు ఇస్తూ నిర్మాణాలను చేపట్టాలని, మొత్తంగా 2047 నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
ఏపీకి రాబోయే ప్రాజెక్టుల వివరాలు..
హైదరాబాద్- బెంగళూరు వరకు ఒకటి. ఏపీలో 261 కి.మీ., కర్ణాటకలో 65 కి.మీ., తెలంగాణలో 190 కి.మీ. మేర కింద నిర్మాణం కానుంది.
ఖరగ్‌పూర్- కటక్- విశాఖపట్నం వరకు బెంగాల్, ఒడిశా మీదుగా ఏపీకి రానుంది. మొత్తం 783 కి.మీ. కాగా, ఏపీలో 179 కి.మీ. ఉండనుంది.
తెలంగాణలోని నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ఎన్‌హెచ్-65 నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఒకటి; మొత్తం 140 కి.మీ.
వైజాగ్- కాకినాడ- రామేశ్వరం- విజయవాడ- గుంటూరు- ఒంగోలు వరకు ఒకటి. ఏపీ పరిధిలో 335 కి.మీ.తో అతిపెద్ద హై స్పీడ్ కారిడార్.
నాగపూర్-కాకినాడకు ఒక కారిడార్. ఇది ఒడిశాలో మొదలై మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ మీదుగా ఏపీకి అనుసంధానం కానుంది. మొత్తం 696 కి.మీ. ఏపీలో 113 కి.మీ. నిర్మాణం కానుంది.
హైదరాబాద్-చెన్నై మార్గంలోనూ ఏపీలో 400 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుంది.
కర్నూలు- కడప-తిరుపతి (బెంగళూరు-చెన్నై మార్గంలో భాగం) ఒకటి. ఇది ఏపీ పరిధిలో దాదాపు 377 కి.మీ. ఉండనుంది.
తెలంగాణకు రాబోయే హైస్పీడ్ కారిడార్‌లు..
హైదరాబాద్- రాయపూర్ వరకు ఒకటి. ఇది ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర మీదుగా రానుంది. మొత్తం 429 కిలోమీటర్లు ఉండగా తెలంగాణలో 165 కి.మీ. నిర్మాణం కానుంది.
హైదరాబాద్- బెంగళూరు వరకు ఒకటి. కర్ణాటక, తెలంగాణ, ఏపీల మీదుగా నిర్మాణం కానుండగా రాష్ట్రంలో 190 కి.మీ. ఉండనుంది.
నాగపూర్-హైదరాబాద్‌కు ఒకటి. ఇది తెలంగాణలో 297 కి.మీ. మేర నిర్మాణం కానుంది.
హైదరాబాద్- చెన్నై వరకు ఒక హై స్పీడ్ కారిడార్. తెలంగాణలో 83 కి.మీ. ఉంటుంది.
హైదరాబాద్- విశాఖపట్నం వరకు ఒక రోడ్డు ఉండగా ఇది రాష్ట్రంలో 244 కి.మీ. మేర ఉండనుంది.
పూణె-సోలాపూర్-సంగారెడ్డి వరకు ఒక కారిడార్. ఇది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రానుంది. మొత్తం 403 కి.మీ. ఉండగా, రాష్ట్రంలో 72 కి.మీ. నిర్మాణం జరగనుంది.
కాగా, రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని విజన్-2047 కింద 2031లో అవార్డు పాస్ చేయాలని ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణాన్ని చేపట్టేలా అడుగులు వేస్తుండడం గమనార్హం. ఇవిగాక మిస్సింగ్, లింక్ రోడ్లు కూడా రానున్నాయి.
పోర్టు కనెక్టివిటీలు..
కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ బీచ్ వరకు 41 కి.మీ. 4 లేన్ల రోడ్డు నిర్మాణం.
నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 22 కి.మీ. మేర 4 లేన్ల రోడ్డు.
గంగవరం పోర్టు నుంచి తంగలం వరకు 7 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం.
సూళ్లూరుపేట- మోమిడి వరకు 62 కి.మీ. మేర ఒక రోడ్డు.
గుంటూరు- తెనాలి- చందోల్- నిజాంపట్నం వరకు 31 కి.మీ. మేర ఒక రహదారి.
భావనపాడు పోర్టు నుంచి ఖారాపూర్- విశాఖపట్నం రోడ్డుకు, రామాయపట్నం పోర్టు నుంచి హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌కు కనెక్టింగ్ రోడ్లు. (వీటిని స్పర్ రోడ్లు అంటారు.) వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లను వెడల్పు చేసే ప్రాజెక్టులు కూడా నివేదికలో ఉన్నాయి.