ఐఏఆర్‌ఐ డైరక్టర్‌గా శ్రీనివాసరావు నియామకం సరైందే!
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:13 AM
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఐ) డైరక్టర్‌గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమాకంపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) స్పష్టం చేసింది.

ఐసీఏఆర్‌పై ఆరోపణలు నిరాధారం
వ్యవసాయ పరిశోధన మండలి స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఐ) డైరక్టర్‌గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమాకంపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) స్పష్టం చేసింది. గతంలో ఐఏఆర్‌ఐ డైరక్టర్ పదవి భర్తీ విషయంలో అనుసరించిన నిబంధనల ప్రకారమే శ్రీనివాసరావు నియమాకం జరిగిందని, నిబంధనలను సవరించలేదని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఐసీఏఆర్ ఒక ప్రకటన జారీ చేసింది. అధికారిక విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్న సమయంలో సదరు అధికారిని రిలీవ్ చేయడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయని తెలిపింది. శ్రీనివాసరావు జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ అకాడమీ(నార్మ్) డైరెక్టర్ పదవి నుంచి అధికారికంగా రిలీవ్ అయిన తర్వాతే ఐఏఆర్‌ఐ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారని పేర్కొంది.
ఐసీఏఆర్ సభ్యుడు ఒకరు చేసిన ఆరోపణలలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా, నార్మ్ డైరక్టర్ పదవి నుంచి శ్రీనివాసరావును ఐఏఆర్‌ఐ డైరక్టర్‌గా ఆకస్మికంగా బదిలీ చేయడాన్ని తప్పుపడుతూ పాలక మండలి సభ్యుడు ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అనుసరించి కొన్ని మీడియా సంస్థలు ఐసీఏఆర్‌పై ఆరోపణలు గుప్పించాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన ఐసీఏఆర్.. అవగాహన లేని వారే తమపై నిందలు మోపుతున్నారని ఆక్షేపించింది. కాగా, చెరుకుమల్లి శ్రీనివాసరావు స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు. బాపట్లలోని వ్యవసాయ కళశాలలో అగ్రికల్చల్ బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివారు. గత గురువారం ఆయన ఐఏఆర్‌ఐ డైరక్టర్‌గా నియమితులయ్యారు. ఐఏఆర్‌ఏ డైరెక్టర్ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి శ్రీనివాసరావు కావడం విశేషం.