Share News

Thirst.. Thirst: వన్యప్రాణులకు దాహం.. దాహం..

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:50 AM

ఎండల తీవ్రతకు అడవుల్లో ఊట కుంటలు, చిన్న చిన్న వాగులు, అటవీశాఖ నిర్మించిన చెక్‌డ్యాంలు, కుంటలు ఎండిపోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న అటవీ జంతువులు దాహం దాహం అంటూ తాగునీటి కోసం పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం వన్యప్రాణుల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి.

Thirst.. Thirst: వన్యప్రాణులకు దాహం.. దాహం..

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఎండల తీవ్రతకు అడవుల్లో ఊట కుంటలు, చిన్న చిన్న వాగులు, అటవీశాఖ నిర్మించిన చెక్‌డ్యాంలు, కుంటలు ఎండిపోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న అటవీ జంతువులు దాహం దాహం అంటూ తాగునీటి కోసం పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం వన్యప్రాణుల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం అడవికి సమీపంలో ఉండే గ్రామాల వైపు వెళ్తూ వేటగాళ్లు, ఊర కుక్కల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లు దాటే క్రమంలో వాహనాలు ఢీ కొని ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఎండాకాలంలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ సాసర్‌పిట్లు నిర్మించాలి. ఉన్న వాటికి మరమ్మతులు చేయాలి. నిత్యం ట్యాంకర్ల ద్వారా వాటిల్లో నీటిని నింపి సమస్య తలెత్తకుండా చూడాలి. సోలార్‌ బోర్లకు మరమ్మతు చేయడంతోపాటు అవసరం మేరకు కొత్త వాటిని ఏర్పాటు చేయాలి. అటవీశాఖ ఈ పనులు చేపట్టకపోవడంతో వన్యప్రాణులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

అటవీ విస్తీర్ణం 27,402.98 చ.కి.మీ.

తెలంగాణలో ప్రకటిత అటవీ ప్రాంతం 27,402.98 చదరపు కిలోమీటర్లు. అందులో 2 టైగర్‌ రిజర్వులు, 7 అభయారణ్యాలు, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. వీటిలో పులులు, చిరుతలు, జింక జాతి వన్యప్రాణులు, మనుబోతులు, ఎలుగబంట్లు, తోడేళ్లు, నక్కలు, అడవిదున్నలు ఇలా వివిధ రకాల జంతువులతో పాటు సరీసృపాలు ఉన్నాయి. వీటన్నింటికి తాగునీరు తప్పని సరి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రోజురోజుకు నీటివనరుల్లో నీరు అడుగంటిపోతోంది. కాగజ్‌నగర్‌, కడెం, బెజ్జూరు, పెంచకల్‌పేట, కరమొరి, వాంకిడి, తిర్యాని ప్రాంతాల్లో కొత్తగా సాసర్‌పిట్ల నిర్మాణాలు చేపట్టలేదు. పాడైన వాటికి మరమ్మతులు కూడా చేయలేదు. అక్కడక్కడ బాగున్న సాసర్‌ పిట్లలలో రెండు మూడు రోజులకొకసారి ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో సాసర్‌పిట్లు లేకపోవడంతో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లో కూడా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో మూగజీవాలకు నీటిఎద్దడి రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నా క్షేత్రస్థాయిలో నీటి సరఫరా కనిపించడం లేదు. జిన్నారం, బెల్లపల్లి, మంచిర్యాల, చెన్నూర్‌ అటవీ ప్రాంతాల్లో ఇవే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వరంగల్‌ జోన్‌ ఏటూరు నాగారం, ములుగు, లక్నవరం, కొత్తగూడెం జోన్‌ కిన్నెరసాని, పోచారం అడవుల్లో సైతం నీటి కొరత మొదలైంది.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అంతంతే

అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా అది అంతంత మాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల సోలార్‌బోర్లు పాడైనా వాటిని బాగుచేయించలేదు. మరికొన్ని చోట్ల బోర్ల ద్వారా నీరు అందుతున్నప్పటికీ సరిపడా అందడం లేదు. ఇదీగాక, గతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రైవేట్‌ ట్యాంకర్లు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. కొత్తగా సాసర్‌పిట్లు నిర్మించేందుకు, పాతవాటికి మరమ్మతులు చేయించేందుకు కాంట్రాక్టర్లు సుముఖత చూపడంలేదని వినికిడి.

Updated Date - Mar 11 , 2024 | 07:50 AM