Share News

TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి ఘటన.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సీరియస్

ABN , Publish Date - Jan 31 , 2024 | 10:33 AM

Telangana: హయత్‌నగర్‌ డిపో-1కు చెందిన కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.

TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి ఘటన.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సీరియస్

హైదరాబాద్, జనవరి 31: హయత్‌నగర్‌ డిపో-1కు చెందిన కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం (TSRTC) తీవ్రంగా ఖండించింది. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడంపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదే మా విజ్ఞప్తి...

మొదటి ట్రిప్పని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ విన్నవించినప్పటికీ ఆ మహిళా ఏ మాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారని... నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారని.. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘‘ఎక్స్’’ వేదికగా తెలియజేశారు.


ఇదీ జరిగింది...

హయత్‌నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్‌పై ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్ 1 డిపోకు చెందిన హయత్‌నగర్ నుంచి అప్జల్‌గంజ్ రూట్‌లో నడిచే 72 బస్ సర్వీస్‌లో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో బస్ కండక్టర్‌‌ను పచ్చి బూతులు తిడుతూ దాడి చేసింది. మర్డర్ చేసేస్తానంటూ బెదిరించింది. అంతే కాకుండా పెద్దాయన అని కూడా చూడకుండా కాలితో తన్నింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినప్పటికీ సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇంత జరుగుతున్నా కండక్టర్ మాత్రం ఒక మహిళ అనే గౌరవంతో సంయమనం పాటించడం హయత్‌నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అద్దం పడుతోంది. అయితే కండెక్టర్‌పై మహిళ దాడికి సంబంధించి హయత్‌నగర్ డిపో అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 31 , 2024 | 12:44 PM