Share News

Bandla Ganesh: హరీషన్నా.. ఎందుకింత ఈర్ష్య.. అసూయ..?

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:09 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలరోజుల పాలనపై నటుడు, సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉందని కొనియాడారు.

Bandla Ganesh: హరీషన్నా.. ఎందుకింత ఈర్ష్య.. అసూయ..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలరోజుల పాలనపై నటుడు, సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌, గాందీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉందని కొనియాడారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నిన్న (ఆదివారం) మీడియా సమావేశంలో దారుణంగా మాట్లాడారన్నారు. అసూయ, ద్వేషంతో మాట్లాడారని, ఒక రోజు హరీష్ రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత మాట్లాడతారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ప్రగతిపథంలో దూసుకుపోతున్నారని అన్నారు.

అన్నీ ఉడుకుతాయ్!

వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పప్పులుడకవని హరీష్ రావు అన్నారని, అదే వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో బిర్యానీ, చికెన్ అన్నీ ఉడుకుతాయని బండ్ల గణేష్ అన్నారు. వంద రోజుల తర్వాత కాంగ్రెస్‌ను హరీష్ రావు ఏమీ చేయలేరని అన్నారు. నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, ఆరోగ్య బీమా రూ. 10 లక్షలు చేశామని, సీఎం రేవంత్ రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు.

ఎందుకిలా హరీషన్నా..?

నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే.. హరీష్ రావు ఎందుకింత ఈర్ష్య పడుతున్నారని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ మంత్రులు దర్యాప్తు చేస్తున్నారని, డెమొక్రసీ అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తోందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌లా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజు ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులే అయిందని అర్ధం చేసుకోకుండా హరీ్ష్ రావు, కేటీఆర్ ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. అధికారుల నియాకాల్లో కూడా తమ ప్రభుత్వం సమ సమాజం పాటించిందని, బంధుప్రీతి, కుల, రాగద్వేషాలకు అతీతంగా సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారులను నియమించామని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

రేవంత్ అంటేనే..!

అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతోందని, ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారని బండ్ల గణేష్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్‌కు ఈర్ష పిక్ స్టేజ్‌కు చేరుకుందన్నారు. ఈ పది సంవత్సరాలు ఏం చేశారు? తెలంగాణకు రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని జోష్యం చెప్పారు. రాష్ట్రపతి వస్తే స్వాగతం పలకడానికి కూడా మీ ముఖ్యమంత్రి వెళ్లలేదని, మాజీ రాష్ట్రపతి వస్తే మా సీఎం వెళ్లారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని, ఏ సమస్య ఉన్న ప్రజలు సచివాలయంకు వెళ్తున్నారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 08 , 2024 | 01:38 PM