Share News

Mahabhunagar : వరదతో రైతుల్లో ఆశ!

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:51 AM

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు స్వల్పంగా వరద రాక ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదవుతుందని అంచనాల మేరకు ప్రాజెక్టుల పరిధిలోని రైతులు వరదపై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది కృష్ణా బేసిన్‌ పరిధిలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. ఈ కారణంగా పలు ఎత్తిపోతల పథకాల కింద వానాకాలం సీజన్‌లోనే వరి పంట ఎండిపోగా ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే కూడా ప్రకటించారు.

Mahabhunagar : వరదతో రైతుల్లో ఆశ!

కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా వరద రాక.. గత ఏడాది వరదలు లేకపోవడంతో ఎండిన పంటలు

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు స్వల్పంగా వరద రాక ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదవుతుందని అంచనాల మేరకు ప్రాజెక్టుల పరిధిలోని రైతులు వరదపై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది కృష్ణా బేసిన్‌ పరిధిలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. ఈ కారణంగా పలు ఎత్తిపోతల పథకాల కింద వానాకాలం సీజన్‌లోనే వరి పంట ఎండిపోగా ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే కూడా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు కర్ణాటకలో కురిసే వర్షాలే ప్రధాన ఆదరువుగా ఉంటాయి.

ఎగువ నుంచి వరద రాకపోతే ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగు కాదు. సాధారణంగా కృష్ణా నదికి 90 రోజుల వరద దినాలు ఉంటాయి. జూన్‌ మొదటి వారంలో వరద ప్రారంభమై అక్టోబరు వరకు కొనసాగుతుంది. గత ఏడాది మాత్రం 60 రోజుల కంటే తక్కువగా వరద దినాలు నమోదయ్యాయి. ఈ కారణంగా జూరాల నుంచి మొదలుకొని, నాగార్జున సాగర్‌ వరకు పంటల సాగుకు తీవ్ర గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి వరదల రాక మొదలవడంతో సాగు, తాగునీటికి కొరత ఉండదని భావిస్తున్నారు. సోమవారం (ఈనెల 11) ఉదయం వరకు ఈ సీజన్‌లో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు 14 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ప్రస్తుత అంచనాల ప్రకారం వర్షాలు ఎక్కువగా కురిస్తే వానాకాలంతో పాటు, యాసంగి పంటల సాగుకు కూడా ఢోకా ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనీస నీటి మట్టాలు చేరాకే నిర్ణయం: ఈఎన్‌సీ(జనరల్‌)

రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో కనీస మట్టాలకు నిల్వలు చేరుకున్నాకే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం 2024-25 వాటర్‌ ఇయర్‌లో వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నీటి విడుదలపై ఈఎన్‌సీ(జనరల్‌) అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిశీలించిన యంత్రాంగం.. ఇప్పట్లో నీటివిడుదలపై నిర్ణయాలు వద్దని తీర్మానించింది.

Updated Date - Jun 12 , 2024 | 05:53 AM