Share News

Hyderabad: అక్బరుద్దీన్‌తో కలిసి టీ తాగుతావా? మంత్రి పొన్నంపై గ్రేటర్‌ కాంగ్రెస్ నేతల గరం

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:47 AM

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌(MLA Akbaruddin)తో కలిసి టీ తాగుతావా.? అంటూ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)పై గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు గరం గరమయ్యారు.

Hyderabad: అక్బరుద్దీన్‌తో కలిసి టీ తాగుతావా? మంత్రి పొన్నంపై గ్రేటర్‌ కాంగ్రెస్ నేతల గరం

హైదరాబాద్‌ సిటీ: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌(MLA Akbaruddin)తో కలిసి టీ తాగుతావా.? అంటూ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)పై గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు గరం గరమయ్యారు. ఫిరోజ్‌ఖాన్‌, అజారుద్దీన్‌ ఆయనతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతల సమావేశం డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో బుధవారం జరిగింది. ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి మంత్రి పొన్నం హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గెలుపుదిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలు, కార్యకర్తలతో చర్చించారు. గురువారం నుంచి మూడు రోజులపాటు నగరంలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తుండడంతో ఆయా అంశాలను వివరించారు. సమావేశం అనంతరం రెండు రోజుల క్రితం ఉప్పుగూడలో అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీతో కలిసి పొన్నం టీ తాగిన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ప్రారంభోత్సవం రోజున అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం ఫొటో లేకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు అప్పటికే గుర్రుగా ఉన్నారు. ఈక్రమంలో అక్బరుద్దీన్‌తో కలిసి టీ తాగడాన్ని తప్పుబడుతూ గాంధీభవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి పొన్నంపై ఫిరోజ్‌ఖాన్‌, అజారుద్దీన్‌ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివాదం పెద్దదవుతున్న క్రమంలో సీనియర్లు కలగజేసుకుని సర్దిచెప్పారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కోట నీలిమ, కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2024 | 11:47 AM