Share News

Hyderabad: ఐదు కారిడార్లలో సొరంగ మార్గాలు.. ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేలా నిర్మాణం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:32 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాలతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై జీహెచ్‌ఎంసీ అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

Hyderabad: ఐదు కారిడార్లలో సొరంగ మార్గాలు.. ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేలా నిర్మాణం

- పర్యాటకులనూ ఆకర్షించేలా ద్విముఖ వ్యూహం

- గతంలోనూ టన్నెల్‌ నిర్మాణానికి అధ్యయనం

- రూ.3 వేల కోట్ల సూత్రప్రాయ వ్యయ అంచనా

- మహానగరంలో ఆచరణ సాధ్యమేనా?

శరవేగంగా నగరం విస్తరిస్తుండడం, జనాభా కోటిన్నరకు చేరడం, జనాభాతో పోటీపడుతూ వాహనాల సంఖ్య పెరగడం.. వెరసి మహానగరం ట్రాఫిక్‌ గ్రిడ్‌లాక్‌గా మారింది. రోడ్లు విస్తరించినా, వంతెనలు నిర్మించినా.. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంపై కసరత్తు మొదలైంది.

హైదరాబాద్‌ సిటీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాలతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై జీహెచ్‌ఎంసీ అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తికరణ కోరుతూ గతంలో బల్దియా నోటిఫికేషన్‌ ప్రకటించగా పలు ఏజెన్సీలు ఇంజనీరింగ్‌ విభా గం అధికారులను సంప్రదించాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) చేపడుతున్నారు. వంతెనలు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా నగరానికి పర్యాటక హంగులు అద్దడం, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా కాంగ్రెస్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఐదు కారిడార్లలో సొరంగ మార్గాలు నిర్మించాలని భావిస్తోంది.

గతంలో రూ.3 వేల కోట్లతో ప్రతిపాదన..

ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లలో వంతెనల నిర్మాణానికి గతంలో ప్రణాళికలు రూపొందించారు. దీనికి సంబంధించి అధ్యయనమూ చేశారు. ఒక్కోవైపు రెండు లేన్ల చొప్పున సొరంగ మార్గాల నిర్మాణానికి సుమారు రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. జాతీయ పార్కు కావడం.. పర్యావరణంపై ప్రభావం పడుతుందన్న అభ్యంతరాలు, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో కేసుతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. భూగర్భంలోని యుటిలిటీస్‌ మార్చేందుకు, సొరంగ మార్గం రోడ్డులో కలిసే చోట (ఎట్‌ గ్రేడ్‌) భారీగా ఆస్తుల సేకరణ అవసరం. వంతెన నిర్మాణంతో పోలిస్తే దాదాపు నాలుగింతలు ఎక్కువ వ్యయం అవుతుండడంతో గతంలో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. దుర్గంచెరువు నుంచి ఖాజాగూడ చౌరస్తా వరకు సొరంగమార్గం నిర్మించాలని భావించినా, నిర్మాణవ్యయం ఎక్కువగా ఉండడంతో ముందడుగు పడలేదు. ఈక్రమంలో సొరంగమార్గాల నిర్మాణం ఆచరణ సాధ్యమవుతుందో లేదో చూడాలి.

city1.jpg

ఈ కారిడార్లలో సొరమార్గాలు

- ఐటీసీ కోహినూర్‌ నుంచి ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడల మీదుగా విప్రో కూడలి వరకు..

- ఐటీసీ కోహినూర్‌ నుంచి మైండ్‌స్పేస్‌ మీదుగా జేఎన్‌టీయూ వరకు..

- ఐటీసీ కోహినూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 45, మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10 వరకు..

- జీవీకే 1 మాల్‌ నుంచి మాసబ్‌ట్యాంక్‌ మీదుగా నానల్‌నగర్‌ వరకు..

- నాంపల్లి నుంచి చార్మినార్‌, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు..

Updated Date - Mar 09 , 2024 | 11:32 AM