Share News

Hyderabad: పార్కింగ్‌కు సమగ్ర పాలసీ.. సమస్యకు చెక్‌ పెట్టేలా జీహెచ్‌ఎంసీ కసరత్తు

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:52 AM

మహానగరంలో పార్కింగ్‌ చిక్కులకు చెక్‌ పెట్టాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్‌ చేయడం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది.

Hyderabad: పార్కింగ్‌కు సమగ్ర పాలసీ.. సమస్యకు చెక్‌ పెట్టేలా జీహెచ్‌ఎంసీ కసరత్తు

- మల్టీ పర్పస్‌ పార్కింగ్‌ కాంప్లెక్సులపై దృష్టి

- ప్రత్యేక పోర్టల్‌/మొబైల్‌ యాప్‌ ద్వారా సమాచారం

హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో పార్కింగ్‌ చిక్కులకు చెక్‌ పెట్టాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్‌ చేయడం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. సమగ్ర పార్కింగ్‌ పాలసీ రూపకల్పనకు సిద్ధమైంది. ఈమేరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులతో కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌(Commissioner Ronaldros) చర్చించారు. ఓ ఏజెన్సీ పార్కింగ్‌ నిర్మాణ నమూనాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించింది. అధునాతన మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్సులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రైవేట్‌ స్థలాల యజమానులు పార్కింగ్‌ సదుపాయం కల్పించేందుకు ముందుకు వస్తే.. వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి..? రుసుము వసూలు తదితర అంశాలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలన్నారు. ప్రధాన రహదారులతో పాటు ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే కాలనీ రోడ్ల పక్కనా పార్కింగ్‌ సదుపాయం కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వాణిజ్య సముదాయాల వద్ద పార్కింగ్‌ సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ స్థలాల వద్ద ప్రకటనల ఏర్పాటు ద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయం పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పార్కింగ్‌ సదుపాయాల వివరాలను వాహనదారులు సులువుగా తెలుసుకునేలా ప్రత్యేక పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Updated Date - Mar 21 , 2024 | 10:52 AM