Share News

Hyderabad: హైడ్రాతో రియల్‌ ఎస్టేట్‌ తగ్గలేదు

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:01 AM

హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ తగ్గిందనడం అవాస్తవమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు.

Hyderabad: హైడ్రాతో రియల్‌ ఎస్టేట్‌ తగ్గలేదు

  • 2024 ప్రథమార్థంలో ఐదేళ్ల గరిష్ఠానికి..

  • ఇళ్ల విక్రయాల విలువ రూ.58వేల కోట్లు

  • 2025 నవంబరుకు డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన్‌

  • పది రోజుల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు

  • ఈ నెలలో ఆరాంఘర్‌ ప్లైఓవర్‌ ప్రారంభం

  • మీడియాతో చిట్‌చాట్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ తగ్గిందనడం అవాస్తవమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు. నిజానికి దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్‌ఎస్టేట్‌ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచిందని వివరించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల విక్రయాల విలువ రూ.58,481 కోట్లుగా నమోదైందని, ఇది గడిచిన అయిదేళ్ల గరిష్ఠమని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం రియల్‌ఎస్టేట్‌ పెరిగిందని.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు వచ్చిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. బుధవారం వారు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘హెచ్‌సిటీ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల అభివృద్థి పనులు-- ఎస్‌ఆర్‌డీపీ ఫ్లైఓవర్లు, నాలాల విస్తరణ, అండర్‌పా్‌సల నిర్మాణం, కూడళ్ల అభివృద్థి, రోడ్ల విస్తరణ రియల్‌ఎస్టేట్‌ రంగానికి ఊతమిస్తాయని భావిస్తున్నాం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల్లో భవన నిర్మాణ అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రణాళిక విభాగం అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు.


భవన నిర్మాణాలకు సంబంధించి ఈ ఏడాది నవంబరు వరకు జీహెచ్‌ఎంసీలో 21,346కు గాను.. 20,240 దరఖాస్తులను పరిష్కరించాం. గత ఏడాదితో పోలిస్తే.. 20ు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిష్కారం ఈ ఏడాది 40ు మేర వృద్ధిని నమోదు చేసింది. హెచ్‌ఎండీఏలో లేఅవుట్‌, భవన నిర్మాణాలు, ఆక్యూపెన్సీతోపాటు వివిధ అనుమతుల దరఖాస్తులు ఈ ఏడాది 45ు పెరిగాయి. దరఖాస్తుల పరిష్కారాలు కూడా 24ు మేర పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే హైదరాబాద్‌ ముందంజలో ఉంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ నమోదైంది. గత ఏడాది సగటు త్రైమాసిక లీజు ఒప్పందాలతో పోలిస్తే.. ఇది 11 శాతం అధికం’’ అని వారు వివరించారు. ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని, ఈ నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. మరో ఐదు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ‘‘దీంతోపాటు.. హెచ్‌సిటీ కింద రూ.7,032 కోట్లతో 38 ప్రాజెక్టులు చేపడతాం. సీఆర్‌ఎంపీ-2 కింద రూ.3925 కోట్లతో 1,143 కిలోమీటర్ల మేర 934 రోడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టాం. ఎస్‌ఎన్‌డీపీ-2 కింద రూ.667కోట్లతో 40 పనులను చేపడతాం. ఎన్‌డీఎంఎ్‌స కింద రూ.291 కోట్లు రానుండడంతో 41 పనులను చేపట్టేందుకు అంచనాలను రూపొందించాం’’ అని వ్యాఖ్యానించారు.


నవంబరులోగా మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా

జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలో.. 2050 వరకు భవిష్యత్తు అవసరాల అనుగుణంగా ఒకే మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేందుకు చర్యలు చేపట్టామని, వచ్చే ఏడాది నవంబరులోగా ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను తీసుకొస్తామని ఇలంబర్తి, సర్ఫరాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. టీజీబీపాస్‌ స్థానంలో తీసుకొచ్చిన బిల్డ్‌నౌను జీహెచ్‌ఎంసీలో త్వరలో అమలు చేస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఎలివేటెడ్‌ కారిడార్లు, ఫోర్త్‌ సిటీకి ఔటర్‌ రావిర్యాల-13 ఎగ్జిట్‌ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఇలంబర్తి, సర్ఫరాజ్‌ తెలిపారు. ఎలివేటెడ్‌ కారిడార్లకు రక్షణ శాఖ నుంచి 124 ఎకరాల భూములకు క్లియరెన్స్‌ వచ్చిందని, ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి మరో 24 ఎకరాలకు క్లియరెన్స్‌ రావాల్సి ఉందన్నారు. రెవెన్యూ అధికారులు 70 ఎకరాల వరకు ప్రైవేటు స్థలాల సేకరణను చేపట్టారని, ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జూలై వరకు పూర్తవుతుందని తెలిపారు. మరో పది రోజుల్లో ఎలివేటెడ్‌ కారిడార్ల పనులను చేపడుతామన్నారు.

13.jpg

Updated Date - Dec 26 , 2024 | 04:01 AM