Share News

Mahalakshmi Scheme: ఇంట్లో గ్యాస్‌ కనెక్షన్‌ ఎవరిపేరు మీదున్నా సబ్సిడీ!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:55 AM

మహాలక్ష్మి పథకంలో రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ పథకం ఉన్న పలు సందేహాలకు పౌర సరఫరాలశాఖ స్పష్టతనిచ్చింది. మహిళల పేరు మీదే కాకుండా, కుటుంబ సభ్యుల్లో

Mahalakshmi Scheme: ఇంట్లో గ్యాస్‌ కనెక్షన్‌ ఎవరిపేరు మీదున్నా సబ్సిడీ!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ పథకం ఉన్న పలు సందేహాలకు పౌర సరఫరాలశాఖ స్పష్టతనిచ్చింది. మహిళల పేరు మీదే కాకుండా, కుటుంబ సభ్యుల్లో ఎవరిపేరుమీద గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా కూడా వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. అయితే గ్యాస్‌ కనెక్షన్‌ ఎవరి పేరు మీద ఉందో, సదరు వ్యక్తిపేరు రేషన్‌కార్డులో తప్పనిసరిగా నమోదై ఉండాలని పేర్కొంది. రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమలుచేస్తున్న నేపథ్యంలో ఆ కార్డులో పేరున్న ఏవ్యక్తి పేరుమీద గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా... వారికి వంటగ్యాస్‌ సబ్సిడీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది. పథకానికి అర్హతలు ఉండికూడా లబ్ధిదారుల జాబితాలో పేరు లేనివారికోసం మరో అవకాశం కల్పించేందుకు సీఎం రేవంత్‌ నిర్ణయించారు. ఆయన ఆదేశాలమేరకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేడో, రేపో మార్గదర్శకాలు జారీకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల రేషన్‌ కార్డులుంటే, అందులో 64 లక్షల మందికే గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి.

వీరిలో 58 లక్షల మంది ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు.దరఖాస్తు చేసుకున్న 58 లక్షల మందిలో సుమారు 40 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులుగా ఎంపికచేసింది. ఎంపికైనవారిలో మహిళలతోపాటు గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న పురుషులు కూడా ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ స్పష్టంచేసింది. లబ్ధిదారుల ఎంపిక రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తు, యాక్టివ్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ప్రాతిపదికగానే జరిగింది. ఇదిలాఉండగా గ్యాస్‌ కనెక్షన్‌ ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తుచేసుకున్నవారు కొందరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. తిరస్కరణకు గురైన కారణాలపై పౌరసరఫరాలశాఖ అధ్యయనం చేసింది. రేషన్‌కార్డులు లేనివారు, చనిపోయిన వారిపేరుతో ఉన్న గ్యాస్‌ కనెక్షన్‌ వాడుతున్న వారు, ఇతరుల దగ్గర గ్యాస్‌ కనెక్షన్‌ కొని వినియోగిస్తున్నవారు, ఎల్‌పీజీ కనెక్షన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

ప్రజాపాలన దరఖాస్తులో రాసిన కస్టమర్‌ ఐడీ, వినియోగదారుల ఐడీతో గ్యాస్‌ కంపెనీల వద్ద ఉన్న వివరాలు ట్యాలీ కాకపోవటం, నెంబర్‌ మ్యాచింగ్‌ జరగకపోవటంతో తిరస్కరణకు గురైనట్లు గుర్తించారు. ఇలాంటివారికి మరో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉన్నందున... గ్యాస్‌ కనెక్షన్‌ వివరాలు, ఆధార్‌, రేషన్‌కార్డులు మరోసారి మండల రెవెన్యూ/పరిషత్‌ కార్యాలయంలో తీసుకునే ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ నిర్వహించటానికి కూడా కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించటంతో... పౌరసరఫరాల భవన్‌లో అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. నేడో, రేపో మార్గదర్శకాలు కూడా జారీచేసే అవకాశాలున్నాయి. అనంతరం మండల కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

Updated Date - Feb 29 , 2024 | 06:49 AM