Share News

Fungal Cyclone: బలహీనపడిన తుఫాన్‌..

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:32 AM

ఫెంగల్‌ తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

Fungal Cyclone: బలహీనపడిన తుఫాన్‌..

  • రిడ్జ్‌ ప్రభావంతో తప్పిన ‘పెను-తుఫాన్‌’ ముప్పు.. పుదుచ్చేరిలో తుఫాన్‌ బీభత్సం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఫెంగల్‌ తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆదివారం రాత్రి తర్వాత మరింత బలహీనపడి పశ్చిమ, వాయువ్యంగా పయనిస్తూ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం వరకు ఏపీలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోస్తా, రాయలసీమల్లోని మరికొన్ని ప్రాంతా ల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కాగా ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది. శనివారం పుదుచ్చేరి వద్ద తుఫాను తీరం దాటడంతో పెనుగాలులతో భారీగా వర్షాలు కురిసి జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం వేకువజాము 5.30 గంటల వరకు 51 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరి నగరంతోపాటు చుట్టూ ఉన్న గ్రామాలు సైతం నీటమునిగాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు.


  • తిరుమలను కప్పేసిన పొగమంచు

తిరుమలలో వరుసగా మూడవరోజైన ఆదివారం కూడా వర్షం కురిసింది. చలి కూడా బాగా పెరగడంతో చాలామంది భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుగు ప్రయాణమయ్యారు. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. గదులు లభించని భక్తులు యాత్రికుల వసతి సముదాయాలు, కార్యాలయాలు, షెడ్లలో తలదాచుకుంటున్నారు. తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్‌రోడ్డులో 14, 15 కిలోమీటర్ల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఫారెస్ట్‌, విజిలెన్స్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు బండరాళ్లు, మట్టిని ట్రాక్టర్ల ద్వారా తొలగించారు.

Updated Date - Dec 02 , 2024 | 03:32 AM