TANA: ‘తానా’ నిధుల మళ్లింపుపై ఫిర్యాదు
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:07 AM
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగువారి ప్రతిష్ఠాత్మక సంఘంలో ఆర్థిక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపుపై ఎఫ్‌బీఐకి...
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అగ్రరాజ్యం అమెరికాలో తెలుగువారి ప్రతిష్ఠాత్మక సంఘంలో ఆర్థిక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్షకు పైగా సభ్యులున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో గత పదిహేనేళ్లుగా అనేక ఆర్థిక అవకతకవలు జరిగాయంటూ అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కు ఫిర్యాదు అందింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ తానా సభ్యులు కోరారు. గతంలో కోశాధికారిగా ఉన్న శ్రీకాంత్ పోలవరపు రూ.25 కోట్ల తానా ఫౌండేషన్ నిధులను తన సొంత కంపెనీలోకి బదిలీ చేసుకున్నారన్న విషయాన్ని తానా పాలకవర్గం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదే ప్రధానాంశంగా ఫిర్యాదు చేశారు. తానా ఫౌండేషన్‌కు చెందిన 37 లక్షల డాలర్లను శ్రీకాంత్.. టెక్సా్‌సలోని తన సొంత కంపెనీ బ్రిహత్ టెక్నాలజీ్‌సలోకి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంతోపాటు వేలాది మంది ఉన్న తానా సభ్యులను శ్రీకాంత్ మోసగించారని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు గత పదిహేనేళ్లుగా తానాలో అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. మ్యాచింగ్ గ్రాంట్ కుంభకోణం, మనీలాండరింగ్, ఇతర ఆర్థిక నేరాలు సైతం జరిగాయన్నారు. ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తానా సభ్యులు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.