Suryapet: ట్రాక్టర్ నాగలికర్రు గొంతులో దిగి..
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:57 AM
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, ట్రాక్టర్ నాగలి కర్రు గొంతులో దిగబడటంతో మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలో ఈ హృదయవిదారకమైన ఘటన జరిగింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాకర్
బైకర్‌ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)లో ఘటన
ఆత్మకూరు(ఎస్), డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, ట్రాక్టర్ నాగలి కర్రు గొంతులో దిగబడటంతో మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలో ఈ హృదయవిదారకమైన ఘటన జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు కలగాని లెనిన్(28), తన భార్య, కుమారుడితో కలిసి గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి శుక్రవారం రాత్రి బైక్‌పై వస్తున్నాడు. రామన్నగూడెం నుంచి వస్తున్న ట్రాక్టర్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్టర్ వెనక వైపు ఉన్న నాగలికర్రు లెనిన్ గొంతులో దిగిబడింది.
ద్విచక్ర వాహనంతో పాటు భార్య, కుమారుడు కింద పడగా నాగలికర్రు గుచ్చుకున్న లెనిన్‌ను సుమారు 50మీటర్లు ట్రాక్టర్ ఈడ్చుకెళ్లింది. ఓ చోట సదరు ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని నిలిపి లెనిన్ మృతదేహాన్ని నాగలికర్రు నుంచి వేరుచేసి, పక్కనపడేసి ట్రాక్టర్‌తో పరారయ్యారని ఎస్సై తెలిపారు. భార్య, కుమారుడు రోదించడంతో గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.