Share News

Caste Discrimination: మహారాష్ట్ర జైళ్లలో కులానికి ప్రాధాన్యం!

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:56 AM

మహారాష్ట్ర జైళ్లు కులానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, హక్కుల కార్యకర్త జీఎన్‌ సాయిబాబ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వచ్చే ఖైదీలకు కులాన్ని బట్టి సౌకర్యాలు కల్పిస్తారన్నారు.

Caste Discrimination: మహారాష్ట్ర జైళ్లలో కులానికి ప్రాధాన్యం!

  • కులాన్ని బట్టి ఖైదీలకు సౌకర్యాలు

  • తల్లి శవాన్ని చూడడానికీ పెరోలివ్వలేదు

  • ‘మీట్‌ ది ప్రెస్‌’లో ప్రొఫెసర్‌ సాయిబాబ

బర్కత్‌పుర, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర జైళ్లు కులానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, హక్కుల కార్యకర్త జీఎన్‌ సాయిబాబ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వచ్చే ఖైదీలకు కులాన్ని బట్టి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. కొత్తగా జైలుకు వచ్చిన వారిని సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో చిత్రహింసలకు గురిచేస్తారని.. దాంతో ఆ ఖైదీలకు జైలు అంటే భయం ఏర్పడుతుందని తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేసిన వారికి మహారాష్ట్ర జైళ్లలో చిత్రహింసలు తప్పవని, జైలు మేనిఫెస్టోలోనే ఈ విషయాలు ఉన్నాయని సాయిబాబ ఆరోపించారు.


గ్యాంగ్‌స్టర్లకు సైతం బెయిల్‌ దొరుకుతుంది కానీ, హక్కుల కార్యకర్తకు మాత్రం బెయిలు, పెరోల్‌ దొరకవని అన్నారు. కన్నతల్లి చనిపోతే శవాన్ని చూడడానికీ పెరోల్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మావోయిస్టుగా ముద్ర వేసి పదేళ్లపాటు నాగ్‌పూర్‌ జైల్లో ఉండి, ఇటీవలే విడుదలైన సాయిబాబతో టీయూడబ్ల్యూజే బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ సాయిబాబ.. గడ్చిరోలి పోలీసులు వ్యవహరించిన తీరు, జైళ్లలో పరిస్థితులపై సంచలన ఆరోపణలు చేశారు.


ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం వల్లనే తనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంటే.. ఉక్కు కౌగిలి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించడమేనని అన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఉపా చట్టం ఎంత దుర్మార్గమైందో ప్రొఫెసర్‌ సాయిబాబ జైలు జీవితమే సాక్ష్యమన్నారు. ఉపా చట్టం రద్దు కోసం బలమైన ఉద్యమం రావాలని కోరారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 03:56 AM