Share News

TG: ‘మేము త్యాగాలు చేస్తే.. మీరు భోగాలు అనుభవించారు’

ABN , Publish Date - Mar 30 , 2024 | 03:41 PM

బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అవకాశాలు పొందిన వారే పార్టీలు మారుతోన్నారని బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లను సంజీవని ఇచ్చి పార్టీ అధినేత కేసీఆర్ బతికించారని ఆయన పేర్కొన్నారు.

TG: ‘మేము త్యాగాలు చేస్తే.. మీరు భోగాలు అనుభవించారు’

హైదరాబాద, మార్చి 30: బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అవకాశాలు పొందిన వారే పార్టీలు మారుతోన్నారని బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లను సంజీవని ఇచ్చి పార్టీ అధినేత కేసీఆర్ బతికించారని ఆయన పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.

రాజయ్య చేతిలో ఓటమి పాలై ఓ మూలన ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని విధాలుగా అవకాశాలు కల్పించారని.. అలాగే ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు సైతం ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా కేసీఆర్‌ను తప్పు పట్టే అర్హత కడియం కావ్య (Kadiyam kavya)కు ఏక్కడిదని ఆయన ప్రశ్నించారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) కారణంగానే రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్‌లు బీఆర్ఎస్‌కు దూరమయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీలు మారుతోన్న వారు.. రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇన్నేళ్ల మీ అనుభవాన్ని మీ రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము త్యాగాలు చేశాము.. మీరు భోగాలు అనుభవించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారుతోన్న వారు.. ఊసరవెల్లి, పాముల కంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారన్నారు.

బీఆర్ఎస్‌లో అన్నీ పదవులు అనుభవించి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లోకి పోతున్నారా? అని వలస వెళ్తున్న నేతలను సూటిగా ప్రశ్నించారు. మా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి.. ఆ తర్వాత పార్టీ మారాలని వారిని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మీకు తీర్థయాత్రలాగా కనిపిస్తుందా? అంటూ వలస నేతలు ఈ సందర్భంగా ఆయన ఈ సూటిగా నిలదీశారు.

హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్‌ తరహాలో పార్టీల మారే నేతలు కనిపిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. వయసు పెరిగిన ప్రతీ వారు మేధావి అనుకుంటే సరిపోదన్నారు. మీరు అంతా స్వార్థపరులని ఆయన పేర్కొన్నారు. కడియం లాంటి వారి వల్ల జాతికి ఎలాంటి లాభం లేదన్న గతంలో మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజమని తెలిందన్నారు. ఇలాంటి వ్యక్తులను రాళ్లతో కొట్టినా పాపం లేదన్నారు.

పార్టీలు మారే వారి విషయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు సమాధానం చెప్పాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకపోతే ఇండ్ల ముందు చావు డప్పులుంటాయని వలస నేతలను ఈ సందర్బంగా హెచ్చరించారు. ఇక కేకే‌ (K Keshava rao)కు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఇటువంటి వ్యతిరేక శక్తులు, ద్రోహులు ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని తెలంగాణ ఉద్యమకారులు, నేతలు, కార్యకర్తలకు ఈ సందర్బంగా ఆయన పిలుపు నిచ్చారు. వరంగల్ లోక్‌సభ (Waragal Loksabha) స్థానం నుంచి తనను బరిలో దిగమని కేసీఆర్ ఆదేశిస్తే.. అందుకు శిరసావహిస్తానని ఏర్రోళ్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు.

మరిన్నీ తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 30 , 2024 | 03:46 PM