Share News

Eatala Rajendar: ఏం ఒరగబెట్టారని విజయోత్సవాలు?

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:03 AM

అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పొందిన ఏకైక పార్టీ రేవంత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ అని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

Eatala Rajendar: ఏం ఒరగబెట్టారని విజయోత్సవాలు?

  • హామీలపై ప్రశ్నిస్తే రేవంత్‌ చిల్లర భాష

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు రెండూ డ్రామా కంపెనీలు: ఈటల

  • నేడు సరూర్‌నగర్‌లో బీజేపీ సభ

మన్సూరాబాద్‌, హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పొందిన ఏకైక పార్టీ రేవంత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ అని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఏం ఒరగబెట్టారని ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమయ్యారంటూ రేవంత్‌ సర్కారును ఆయన ప్రశ్నించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ పెద్దలతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఈటల మాట్లాడారు. తొలి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ఏడాది గడిచినా ఏ గ్యారెంటీని సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు.


రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలను కదిలించినా రేవంత్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని తాము ప్రశ్నిస్తే.. తానో ముఖ్యమంత్రిని అని మరిచిపోయి చిల్లర భాషతో సమస్యలను రేవంత్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సిగ్గుచేటు అని విమర్శించారు. మూసీ ప్రక్షాళన, ఫోర్త్‌ సిటీ ఏర్పాటు, హైడ్రా అంటూ రేవంత్‌ డ్రామాలు ఆడుతున్నారని, వాటి పేర్లతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.


  • మోసాలను ఎండగట్టేందుకే..

సరూర్‌నగర్‌ సభకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నడ్డా, బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఆయన నేరుగా సభాస్థలికి వెళతారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తరిగి ఢిల్లీ వెళతారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఎన్నో మోసాలు చేసిందని, వాటిని నడ్డా ఎండగడతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈ సభ ద్వారా ఒత్తిడి పెంచుతామని ప్రకటించారు.

Updated Date - Dec 07 , 2024 | 04:03 AM