Panchayat elections: పంచాయతీ లేఔట్లపై తెగని పంచాయితీ!
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:14 AM
అనుమతి లేని పంచాయతీ లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ అనంతరం గత ప్రభుత్వం 2020 ఆగస్టు 26న సర్క్యులర్ 257ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
సర్క్యులర్ 257తో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
నాలుగేళ్లుగా కొనుగోలుదారుల ఇబ్బందులు
అనుమతిస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం
హైదరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): అనుమతి లేని పంచాయతీ లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ అనంతరం గత ప్రభుత్వం 2020 ఆగస్టు 26న సర్క్యులర్ 257ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పంచాయతీల పరిధిలో అనుమతి లేని లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. ఈ సర్క్యులర్‌పై కొందరు లేఔట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించగా.. 257 సర్క్యులర్ చట్ట విరుద్ధమంటూ కోర్టు రద్దు చేసింది. అయితే, దీనిపై నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి పంచాయతీల పరిధిలోని లేఔట్లలో ప్లాట్లు తక్కువ ధరకు వస్తుండడంతో చాలా మంది అప్పులు చేసి మరీ కొనుగోలు చేశారు.
కానీ, అప్పటి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ కారణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోలేక, డబ్బులు వెనక్కి తీసుకోలేక ఆర్థికంగా ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. సర్క్యులర్‌పై కొత్త ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ లేఔట్లు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. అయితే, దీనిపై తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాదన మరోలా ఉంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలు పెంచుకునేందుకు గత ప్రభుత్వం ఈ సర్క్యులర్ జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు 2లక్షల వరకు ఉంటాయని, వీటికి అనుమతి ఇస్తే స్టాంప్ డ్యూటీ, ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు, పర్మిషన్ చార్జీల రూపంలో రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సర్క్యులర్ 257సమస్యపై తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి.. పంచాయతీ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో ఒక పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.