Sangareddy: మంజీరలో మొసళ్ల భయానక సవ్వళ్లు!
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:41 AM
సంగారెడ్డి జిల్లా కలబ్‌గూరులోని మంజీర నది పక్కనే ఓ మొసలి మాటువేసి నీళ్లు తాగుతున్న ఓ లేగదూడ గొంతు పట్టింది. ఊపిరాడక ఆ లేగదూడ చనిపోయింది. స్థానికులు తరిమికొట్టడంతో మొసలి నీళ్లలోకి వెళ్లిపోయింది.

నదిలోంచి గట్లు, పొలాల్లో సంచారం.. ఓ లేగదూడపై దాడి
ఐదేళ్ల క్రితమే నదిలో 600పైగా మొసళ్లు.. ఇప్పుడు రెట్టింపు?
సంగారెడ్డి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కలబ్‌గూరులోని మంజీర నది పక్కనే ఓ మొసలి మాటువేసి నీళ్లు తాగుతున్న ఓ లేగదూడ గొంతు పట్టింది. ఊపిరాడక ఆ లేగదూడ చనిపోయింది. స్థానికులు తరిమికొట్టడంతో మొసలి నీళ్లలోకి వెళ్లిపోయింది. మెదక్ జిల్లా చిల్‌పచెడ్ మండలం చండూరులోని పొలాలకు సమీపంలో ఈనెల 18న భారీ మొసలి ప్రత్యక్షమైంది. గట్టుపై మకరం సేదతీరుతుండగా రైతులు చూశారు. స్థానికులు కేకలు వేయడంతో నీళ్లలోకి జారుకుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉన్న మంజీరా నది పొడుగునా ఇలా మొసళ్లు గట్టుపైకి, పొలాల్లో కనిపించడం ఆ పరిసర గ్రామ ప్రజలు, మత్స్య కారులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల వ్యవధిలో సమీప గ్రామాల్లో నాలుగు భారీ మొసళ్లు ప్రత్యక్షం కావడం కలకలం సృష్టిస్తోంది. ఐదేళ్ల క్రితమే మంజీరా నదిలో 600పైగానే మొసళ్లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
ఇప్పుడు వీటి సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చునని భావిస్తున్నారు మంజీరా నది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో మొదలై కర్ణాటకలోని బీదర్ మీదుగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రవహించి నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సింగూరు రిజర్వాయర్, సంగారెడ్డి పట్టణ శివారులో మంజీరా డ్యామ్ నిర్మించారు. సింగూరు రిజర్వాయర్ నుంచి మెదక్ జిల్లా ఘన్‌పూర్ ఆనకట్ట వరకు విస్తరించిన నదిలో మొసళ్లు ఉన్నాయి. దీనిని మంజీరా మొసళ్ల అభయారణ్యంగానూ పిలుస్తుంటారు. ఇటీవల సంగారెడ్డి సమీపంలోని కలబ్‌గూరు వద్ద చేపల పెంపక కేంద్రంలోని ఒక మడుగులో మొసలి చేరింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేటలో ఓ మొసలి ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల కోసం వలలు వేసి తిరిగి సాయంత్రం నది వద్దకు చేరుకోగా అక్కడ బండరాయిపై భారీ మొసలి కనిపించడంతో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
మొసళ్లు లేక బోసిపోయిన సంరక్షణ కేంద్రం
మంజీరా నది సమీప ప్రాంతాల్లో మొసళ్ల సంచారం భయాందోళనకు గురిచేస్తుంటే కలబ్‌గూరు వద్ద మంజీరా డ్యామ్ ఆవరణలో ప్రత్యేకంగా మొసళ్ల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కొలనులో మాత్రం ఒక్క మకరం కూడా లేదు. ఇక్కడ 10 మొసళ్లు ఉండేవి. మొసళ్లకు ఆహారంగా మాంసం పెట్టేవారు. నిధుల కొరత కారణంగా ఏడాది క్రితమే ఆహారం పెట్టడం మానేశారు. కొన్నాళ్లకే ఆ మొసళ్లను అక్కడి నుంచి తరలించి మంజీరా నదిలో వదిలేశారు.