Chada Venkat Reddy: తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:04 AM
తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఎర్రజెండా మీకు కొండంత అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ పిలుపు
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఎర్రజెండా మీకు కొండంత అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌మెట్ మండల సమితి ఆధ్వర్యంలో గురువారం పెద్దఅంబర్‌పేట్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సిద్ధాంత పునాదులపై వందేళ్లపాటు నిలబడిన ఏకైనా పార్టీ సీపీఐ అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల్లో వెలుగులు నింపేందుకు పార్టీ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. దున్నేవాడిదే భూమి అంటూ సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఏకైక పార్టీ అని అన్నారు.
తెలంగాణలో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచామని తెలిపారు. పాలకులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలేదని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని, పోలీసుల కేసులు, బె దిరింపులకు బయపడేది లేదన్నారు. సీపీఐ జాతీయ సమితి నాయకుడు పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తే అండగా ఉంటామన్నారు. చీలిన కమ్యూనిస్టు పార్టీలు కలిసి రావాలని, అప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు.