Share News

10 ఫార్మా విలేజ్‌లు.. 20వేల ఎకరాలు.. వెయ్యి సంస్థలు!

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:00 AM

రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ ఫార్మాసిటీ స్థానంలో ఏర్పాటు చేయదలచిన ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా విలేజ్‌ల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

10 ఫార్మా విలేజ్‌లు.. 20వేల ఎకరాలు.. వెయ్యి సంస్థలు!

  • జాబితా తయారీలో సర్కార్‌.. భూసేకరణకు ముందే పెట్టుబడులపై స్పష్టత

  • 500 కంపెనీల ఆసక్తి.. పెట్టుబడులు రూ.లక్ష కోట్లు దాటొచ్చని అంచనా!

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ ఫార్మాసిటీ స్థానంలో ఏర్పాటు చేయదలచిన ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా విలేజ్‌ల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఫార్మా విలేజ్‌లకు భూసేకరణలో వివాదాలు తలెత్తినా.. రైతులకు నచ్చజెప్పి ఒప్పించడం ద్వారా ముందుకెళ్లాలని భావిస్తోంది. తాజాగా వికారాబాద్‌లో భూసేకరణ విషయంలో తలెత్తిన వివాదాన్ని కూడా ఇలాగే పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే వివిధ ఫార్మా క్లస్టర్‌లలో భూసేకరణ చేపట్టేందుకు ముందే.. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కలిగిన కంపెనీలు, అవి ఏ మేరకు పెట్టుబడులు పెడతాయి, ఎంత మందికి ఉద్యోగాలు కల్పిస్తాయి వంటి అంశాలపై స్పష్టత తీసుకుంటోంది. మొత్తం 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంనిర్ణయించిన నేపథ్యంలో.. వాటికోసం సుమారు 20 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ఫార్మా క్లస్టర్లలో మొత్తం 1000 కంపెనీలకు భూమిని కేటాయించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో ఇప్పటికే 500కు పైగా కంపెనీలను గుర్తించారు. కాగా, భూసేకరణలో వికారాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసే క్లస్టర్‌కు సంబంధించిన సేకరణే మొదటిది. మిగతా క్లస్టర్లలో కొన్నిచోట్ల కొంత ప్రభుత్వ భూమి ఉండగా.. మిగిలింది రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణ పూర్తయి అనుకున్నమేరకు కంపెనీలన్నీ వస్తే రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని సర్కారు అంచనా వేస్తోంది.


  • గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం..

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిసరాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో హైదరాబాద్‌ ఫార్మాసిటీని ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం సగానికి పైగా భూసేకరణ కూడా పూర్తిచేసింది. అయితే ఫార్మా కంపెనీల కాలుష్యంపై స్థానికులు, రైతుల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది. భూసేకరణలో కూడా రైతులు సహకరించలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసింది. ఒకేచోట 20 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటును రద్దు చేసి.. తొమ్మిది జిల్లాల్లో 1000-2000 ఎకరాల చొప్పున పది ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది జిల్లాలను గుర్తించింది. తొలుత వికారాబాద్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో మూడు ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మూడుచోట్ల భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఎన్నో వ్యయప్రయాసలతో రైతులకు పరిహారం ఇచ్చి, కోర్టు కేసులు ఎదుర్కొని భూములు సేకరించాక.. కంపెనీల పెట్టుబడులు ఏ స్థాయిలో వస్తాయి? ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తాయా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అన్నీ అభివృద్ధి చేశాక ఆశించిన పెట్టుబడులు, ఉద్యోగాలు రాకపోతే ఎలా? అన్న అనుమానాలూ తలెత్తడంతో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు ముందే.. ఆసక్తి కలిగిన కంపెనీలను గుర్తించాలని సర్కారు నిర్ణయించింది. పెట్టబోయే పెట్టుబడులను తెలుపాలని ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ కంపెనీలను కోరుతోంది.


  • సిద్ధంగా 500కి పైగా కంపెనీలు..

హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాజెక్టు గత ఐదారేళ్లుగా సాగుతోంది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. విమానాశ్రయం వరకు విశాలమైన రహదారులు, నిరంతర విద్యుత్తు సౌకర్యం కోసం సబ్‌స్టేషన్ల ఏర్పాటు పూర్తిచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ అంటూ గత ప్రభుత్వం భారీగా ప్రచారం చేయడం, జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేంద్రప్రభుత్వం కూడా దీనికి నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) హోదా కల్పించింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపించాయి. 500కు పైగా కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి దరఖాస్తులు కూడా సమర్పించాయి. అయితే భూసేకరణకు సంబంఽధించి కొన్ని చోట్ల కోర్టులో కేసులుండటంతో ఫార్మాసిటీ ప్రారంభంలో జాప్యం జరిగింది. కొత్త ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసినప్పటికీ.. కంపెనీలు మాత్రం పెట్టుబడులపై వెనకడుగు వేయలేదు. అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండటం, రవాణా, మానవ వనరుల పరంగా అనేక అనుకూలతలు ఉండటంతో పెట్టుబడులకు కంపెనీలు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. వీరందరినీ ప్రభుత్వం సంప్రదిస్తోంది. ఆ 500 కంపెనీలు కూడా ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా విలేజ్‌లలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయి. తమ పెట్టుబడుల వివరాలను ప్రభుత్వానికి అందిస్తున్నాయి.


  • కంపెనీలతో మంత్రి ప్రత్యక్ష చర్చలు

పెట్టుబడుల విషయమై పెద్ద కంపెనీలతో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్వయంగా సమావేశమవుతున్నారు. గతవారం డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిం దో, హెటెరో, లారస్‌, ఎంఎ్‌సఎన్‌ వంటి ఐదు దిగ్గజ కంపెనీలతో భేటీ అయ్యారు. ఇవి హైదరాబాద్‌ నుంచి తమ ఉత్పత్తులను ప్రపంచానికి సరఫరా చేస్తున్నాయి. ఒక్కో కంపెనీకి 50ఎకరాల చొప్పున, ఐదు కంపెనీలకు 250 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే పెట్టుబడులు, ఉద్యోగాలపై కంపెనీలు తమ ఆలోచన ప్రభుత్వంతో పంచుకున్నా.. సర్కారు ఆ వివరాలను వెల్లడించలేదు. మొత్తానికి 9 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 10 ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా విలేజ్‌లలో వెయ్యి కంపెనీలు పెట్టుబడులు పెడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కంపెనీల జాబితా సిద్ధమయ్యాక.. పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలను ప్రకటించనుంది.

Updated Date - Nov 13 , 2024 | 04:00 AM