AIIMS University: రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ వర్సిటీ
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:18 AM
దేశంలో ప్రఖ్యాతి గాంచిన ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)’ యూనివర్సిటీని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు
కన్హా శాంతివనం.. అద్భుత ప్రపంచం
పర్యావరణానికి మీ సేవలు అమోఘం
నిర్వాహకుడు కమలేశ్‌తో రేవంత్
వర్సిటీకి స్థలం ఇస్తామన్న కమలేశ్
షాద్‌నగర్/నందిగామ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రఖ్యాతి గాంచిన ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)’ యూనివర్సిటీని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వర్సిటీ ఏర్పాటుకు 200 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. భూమి దొరికితే ఎయిమ్స్ వర్సిటీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు. శాంతివనం నిర్వాహకుడు కమలేశ్ పటేల్‌తో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వర్సిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమలేశ్ సీఎంతో చెప్పినట్లు తెలిసింది. కన్హా శాంతివనం తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కన్హా శాంతివనం అద్భుత ప్రపంచమని.. ఇక్కడ పెద్దఎత్తున మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అభినందనీయమని సీఎం కొనియాడారు. శాంతివనం గురించి విన్నానని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉందని చెప్పారు. యోగా, ధ్యానం, పర్యావరణ సంరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంతో పాటు కాలుష్య నివారణకు చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కమలేశ్‌ను ప్రశంసించారు. అలాగే శాంతివనంలో సాఫ్ట్ స్కిల్స్, కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి విద్యార్థుల నైపుణ్యాలను చూసిన సీఎం.. వారిని అభినందించారు. శాంతివనంలోని రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్ ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం కమలేశ్ పటేల్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు.
బ్యాటరీ కారులో వనంలో తిరిగిన సీఎం
సుమారు 1400 ఎకరాల్లో విస్తరించి ఉన్న కన్హా శాంతివనాన్ని సీఎం రేవంత్ బ్యాటరీ కారులో కూర్చొని కలియతిరిగారు. ఆయన వెంట షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. శాంతివనంలో ఉన్న వివిధ దేశాల మొక్కలు, వాటి అవసరాల గురించి కమలేశ్ పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేస్తూ తీరిక ఉంటే మళ్లీ వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కాగా, సీఎం కోసం షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 3 గంటల పాటు ఆయన రాక కోసం ఎదురు చూశారు. శాంతివనం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు సీఎం రేవంత్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు.
శాంతివనం ప్రతినిధులతో మంత్రి పొన్నం భేటీ
సీఎం రేవంత్ కంటే ముందుగా కన్హా శాంతివనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి శాంతివనం ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని తెలంగాణలో నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు.
రైజింగ్ తెలంగాణ కల సాకారం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏర్పడిన ప్రజాప్రభుత్వ సంకల్పంతో రైజింగ్ తెలంగాణ కల సాకారమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ) సాధనలో రాష్ట్రం గర్వించదగ్గ వృద్ధిని సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుంచే దావోస్, అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించి, పెట్టుబడుల సాధన కోసం చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. 2023 ఏప్రిల్-సెప్టెంబరుతో పోలిస్తే.. 2024 ఏప్రిల్-సెప్టెంబరులో అద్భుత లక్ష్యాలను సాధించామని, రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐల సాధనతో 33 శాతం వృద్ధిని నమోదు చేశామని వివరించారు. ఈ పురోగతిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.