Share News

CM Revanth Reddy: కేసీఆర్ బాటలో బీజేపీ ఆ ఘనత సాధించింది.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

ABN , Publish Date - Jan 30 , 2024 | 09:33 PM

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా భారత్ నిలిచిందని.. ఇది మోదీ ఘనతేనని తూర్పారపట్టారు.

CM Revanth Reddy: కేసీఆర్ బాటలో బీజేపీ ఆ ఘనత సాధించింది.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా భారత్ నిలిచిందని.. ఇది మోదీ ఘనతేనని తూర్పారపట్టారు. మంగళవారం (30/01/24) గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మోదీపై ఈమేరకు విరుచుకుపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీల్లో మోదీ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను కూల్చే ఘనతను బీజేపీ సాధించిందని ఆరోపణలు చేశారు. దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు చేసి మోపారన్నారు.


మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతున్నా.. ప్రధాని మోదీ అక్కడికి ఒక్కసారి కూడా వెళ్లలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ప్రధాని అవ్వడం అవసరమని తెలిపారు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చచ్చిందని, దానికి మనుగడే లేదని విమర్శించారు. అటు.. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారిందని, బీజేపీ & బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. బిల్లా-రంగాలు అన్నట్లు.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణలో కాంగ్రెస్ హామీలు అమలవుతాయన్నారు. కాంగ్రెస్ హామీలు అమలవ్వాలంటే.. 17 లోక్‌సభ సీట్లు గెలవాలన్నారు. మోదీతో కేటీఆర్ చీకటి చర్చలు జరుపుతున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని చెప్పేవారి మాటలు పిచ్చిమాటలేనని తేల్చి చెప్పారు.

పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టుల గురించి మోదీ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాయమాటలు చెప్పారన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా.. మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 2022లోపు పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని మోదీ హామీ ఇచ్చారని, అది కూడా నెరవేర్చలేదని విమర్శించారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా.. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక బడ్జెట్‌లో హామీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న సీఎం.. ఇరిగేషన్ శాఖపై విజిలెన్స్ విచారణ మొదలైందని చెప్పుకొచ్చారు.

Updated Date - Jan 30 , 2024 | 09:33 PM