BV Kamalasan Reddy: 15,791 అరెస్టులు 50వేలకుపైగా కేసులు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:24 AM
డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో అరెస్టులు చేస్తున్నామని ఎక్పైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ బీవీ కమలాసన్ రెడ్డి అన్నారు.
2024లో డ్రగ్స్, గుడుంబా విక్రేతలపై ఉక్కుపాదం .. డ్రగ్స్ హాట్‌స్పాట్‌లుగా ధూల్‌పేట, ఐటీ కారిడార్ నానక్‌రాంగూడ
న్యూఇయర్ వేడుకలపై ప్రత్యేక దృష్టి
జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 బృందాలు
డ్రగ్స్ కేసులో రాజ్‌పాకాలపై చార్జిషీట్!
ఎక్పైజ్ ఈడీ కమలాసన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో అరెస్టులు చేస్తున్నామని ఎక్పైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ బీవీ కమలాసన్ రెడ్డి అన్నారు. అక్రమ మద్యం, నిషేధిత మాదక ద్రవ్యాలు, గుడుంబా తయారీదారులు, విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 50వేలకు పైగా కేసులు నమోదు చేశామని, 15,791 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు చేసిన 13,336 మందిని, అక్రమ మద్యం, డ్రగ్స్ సరఫరా కేసుల్లో 2455 మంది.. మొత్తం 15,791 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు.
అంతకుముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అరెస్టులు పెద్దఎత్తున జరిగాయని వివరించారు. గుడుంబా, అక్రమ మద్యం సరఫరాదారుల్లో 920 మంది తరచూ ఇవే నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వీరిపై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు. అరెస్టు చేసినవారిలో శిక్ష పడేవారు 3శాతంలోపే అన్నారు. శిక్షలకు సంబంధించిన భయం లేకపోవడంతో ఇదే నేరాలు చేస్తున్నారు. దీనిని పెంచేందుకు ఆధారాల సేకరణ, సీజర్ పంచనామాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని కమలాసన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో రూ.48.54 కోట్ల విలువగల 20904 కేజీల గంజాయి, మత్తు పదార్థాలను ధ్వంసం చేశామని, రూ.12.22 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఏపీ నుంచి పెద్దఎత్తున గుడుంబా!
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి గుడుంబా రాష్ట్రానికి పెద్దఎత్తున సరఫరా అవుతోందని, ఇప్పటికే అక్కడి పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి పెద్దఎత్తున గుడుంబా స్థావరాలను ధ్వంసం చేశామని కమలాసన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 92 మండలాలు, 25 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గుడుంబా తయారీ ఎక్కువగా జరుగుతోందన్నారు. డిస్టిలరీ ప్లాంట్ల నుంచి మద్యం అక్రమంగా బయటకు వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. దీనిని అడ్డుకునేందుకు అన్ని పాయింట్ల వద్ద ఏఐ అనుసంధానంతో ఉన్న సీసీటివి కెమెరాలు ఏర్పాటుచేశామని, వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశామన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్, అక్రమ మద్యం వినియోగం ఆరోపణలకు సంబంధించి విచారణ సాగుతోందని, త్వరలో చార్జిషీటు దాఖలు చేస్తామని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ధూల్‌పేటతోపాటు ఐటీ కారిడార్ నానక్‌రాంగూడ డ్రగ్స్ విక్రయాలకు హాట్‌స్పాట్‌గా మారిందన్నారు. ఆపరేషన్ ధూల్‌పేట పేరుతో ఇప్పటికే అనేకమందిని అరెస్టు చేశామని, నానక్‌రాంగూడలో తనిఖీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం, డగ్స్ వాడకం, అమ్మకాలు రవాణాపై ఎక్సైజ్, నార్కొటిక్, పోలీసు అధికారులతో 40 బృందాలు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో పోలీసు, నార్కొటిక్ అధికారులతో కలిసి 17 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకునేందుకు పబ్బులు, బార్లలో తనిఖీలు చేస్తామని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.