Share News

Kaleshwaram project: సాక్ష్యాలన్నీ ధ్వంసం

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:22 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ తెలిపారు.

Kaleshwaram project: సాక్ష్యాలన్నీ ధ్వంసం

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో గ్రౌటింగ్‌తో టెక్నికల్‌ డేటా మాయం

  • బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలిపే ఆధారాల్లేకుండా పోయాయి

  • 32 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహితను పక్కనపెట్టి రూ.1.27

  • లక్షల కోట్లతో కాళేశ్వరం.. నీళ్లు పారింది ఐదేళ్లలో 162 టీఎంసీలే

  • కాళేశ్వరం కమిషన్‌తో కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్‌

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ తెలిపారు. బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక సమర్పించకపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల తీరేనన్నారు. ఈ ఏడాది జూలై-ఆగస్టులో పీసీ ఘోష్‌ కమిషన్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై వెదిరె శ్రీరామ్‌ ఫిర్యాదు చేయగా.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని కమిషన్‌ సూచించింది. ఈ నేపథ్యంలో, బుధవారం జస్టిస్‌ పీసీ ఘోష్‌ను కలిసి అఫిడవిట్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌డీఎ్‌సఏ రిపోర్టుపై కమిషన్‌ ఆయనను ఆరా తీసింది. శ్రీరామ్‌ వివరణ ఇస్తూ.. బ్యారేజీల ఎగువ, దిగువ భాగాల్లో గుంతలు ఏర్పడ్డాయని, దీన్ని గ్రౌటింగ్‌ చేయడంతో జియో టెక్నికల్‌ డేటాను కోల్పోవడం జరిగిందని గుర్తు చేశారు. వానలు తగ్గాక బ్యారేజీల వద్ద జియో టెక్నికల్‌, జియో ఫిజికల్‌ పరీక్షలు చేసి నివేదికలు అందిస్తే... ఆ తర్వాత రెండు నెలల్లో తాము పూర్తి నివేదిక ఇస్తామని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసిందన్నారు. అయితే, కమిషన్‌కు సహాయంగా వేసిన నిపుణుల కమిటీ సూచనలతోనే గ్రౌటింగ్‌ చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారన్నారు. దాంతో జియో ఫిజికల్‌ పరీక్షలు చేసి, నివేదికలు అందించాలని ఎన్‌డీఎ్‌సఏ చెప్పినప్పటికీ ఇప్పటిదాకా నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు. బ్యారేజీల దిగువ భాగంలో ఏయే సమస్యలు ఉన్నాయనే దానిని తెలుసుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు.


  • నీటి లభ్యత ఉన్నా లేనట్లు చెప్పి..

75 శాతం డిపెండబిలీటీతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టిలో 160 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) చెప్పిందని, అయితే నీటి లభ్యత లేదనే కారణాలు చూపించి రీ ఇంజనీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని వెదిరె శ్రీరామ్‌ తన అఫిడవిట్‌లో ఆక్షేపించారు. వ్యాప్కోస్‌ అనేది ఒక వాణిజ్య సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తుందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి రూ.32 వేల కోట్లతో 16.4 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి వీలుగా ప్రాణహిత-చేవెళ్లను చేపట్టగా... కేవలం 2 లక్షల అదనపు ఆయకట్టు కోసం రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం చేపట్టారని గుర్తు చేశారు. దాని వ్యయం ప్రస్తుతం రూ.1,27,000 కోట్లకు చేరుకుందన్నారు. 2019లో కాళేశ్వరం బ్యారేజీలు పూర్తికాగా... ఏటా 180 టీఎంసీలు తరలిస్తామని గత ప్రభుత్వం చెప్పిందని ప్రస్తావించారు. కానీ, 2019-20లో 61.66 టీఎంసీలు, 2020-21లో 31.82 టీఎంసీలు, 2021-22లో 33.97 టీఎంసీలు, 2022-23లో 25.97 టీఎంసీలు, 2023-24లో కేవలం 8.93 టీఎంసీలు కలుపుకొని ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే తరలించారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లతో బ్యారేజీ కడితే... 85 శాతం ముంపు మహారాష్ట్రలో ఉంటే... 15 శాతం మాత్రమే తెలంగాణలో ఉండేదని పేర్కొన్నారు. బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర కోరిందని, అలా తగ్గించినప్పటికీ, 160 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉండేదన్నారు. మహారాష్ట్రలో ముంపు కారణంగా రీ ఇంజనీరింగ్‌ జరిపామనే వాదన అర్థరహితమని కొట్టివేశారు. మెరుగైన పునరావాసం, పునర్‌నిర్మాణం, పరిహారానికి చర్యలు తీసుకొని ఉంటే... బ్యారేజీ కట్టడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని పేర్కొన్నారు.


  • రూ.11.9 వేల కోట్లు వృథా

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రూ.11,917 కోట్లను వెచ్చించారని, ఆ నిధులన్నీ రీ ఇంజనీరింగ్‌తో వృథా అయ్యాయని శ్రీరామ్‌ తెలిపారు. కాళేశ్వరం డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించలేదని, వాటిని ఆమోదించింది నీటిపారుదలశాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) అని గుర్తు చేశారు. తగిన సాంకేతిక పరీక్షలు జరపకుండానే కాళేశ్వరం బ్యారేజీలు కట్టారని.. ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, నిర్మాణం, ఓ అండ్‌ ఎం లోపాలే బ్యారేజీల వైఫల్యానికి కారణమన్నారు. వీటన్నింటివల్లే గతేడాది అక్టోబరులో బ్యారేజీ కుంగిందని నివేదించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే.. మార్చి నెలలో ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీని వేశారని పేర్కొన్నారు. అయితే జియో టెక్నికల్‌ పరీక్షలు చేయాలని ఎన్‌డీఎ్‌సఏ ఆదేశించినప్పటికీ.. గ్రౌటింగ్‌ జరగటం వల్ల.. బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మొత్తం 29 పేజీలతో వెదిరె శ్రీరామ్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

Updated Date - Nov 28 , 2024 | 04:22 AM