Mulugu: అభయారణ్యం చుట్టూ కట్టుదిట్టం!
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:33 AM
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏటూరునాగారం అభయారణ్యాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా(ఎకో సెన్సిటివ్ జోన్‌గా) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యం
సున్నిత పర్యావరణ ప్రాంతంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసిన కేంద్రం
పది కిలోమీటర్ల వరకూ నిషేధిత ప్రాంతం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి) : జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏటూరునాగారం అభయారణ్యాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా(ఎకో సెన్సిటివ్ జోన్‌గా) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని మొత్తం 106 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్‌లో చేర్చాలని భావిస్తోంది. తద్వారా అభయారణ్యం చుట్టూ 10 కిలోమీటర్ల మేర నిషేధిత ప్రాంతంగా ప్రకటించనున్నారు. ఇది అమలులోకి వస్తే ఈ ప్రాంతంలో మైనింగ్, రోడ్డు నిర్మాణ పనులు, పరిశ్రమల ఏర్పాటుకు బ్రేక్ పడనుంది. అంతే కాకుండా.. ఇసుక తవ్వకాలు మొదలుకొని వాహనాల కదలికల వరకు అన్నింటిపై ఆంక్షలను అమల్లోకి రానున్నాయి. కేంద్రం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసి.. పంపిస్తే ఎకో సెన్సిటివ్ జోన్‌గా తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
జోనల్ మాస్టర్ ప్లానే కీలకం
అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ, వృద్ధి కోసం నిషేధిత ప్రాంతంలో ఏయే చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఇందుకోసం వివిధ శాఖల అధికారులతో ములుగు కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆరేళ్ల క్రితమే కేంద్రం ఒక సారి నోటిఫికేషన్ జారీ చేయగా.. మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఆ కాలవ్యవధి కాస్త ముగిసిపోయింది. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరో సారి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించింది.
నిబంధనల ప్రకారం కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశాక.. 545 రోజుల్లోగా అభ్యంతరాలను స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం.. దాని కొనసాగింపు ప్రతిపాదనల ను కచ్చితంగా పంపాల్సి ఉంటుంది. అయితే, ఇది అమలులోకి వస్తే గోదావరి తీరం వెంబడి ఉన్న ఇసుక క్వారీలు, సమ్మక్క-సారలమ్మ ఆలయం కూడా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకే రానున్నాయి. ఈ కారణంగానే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న దానిపై సర్వత్రాఆసక్తి నెలకొంది.