Share News

Kishan Reddy: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:58 AM

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

Kishan Reddy: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

  • ‘సాస్కి’ పథకం కింద కేంద్రం నిధులు

  • దేశ వ్యాప్తంగా 40 ప్రాజెక్టులకు నిధులు

  • తెలంగాణ పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నాం : కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/హనుమకొండ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం రూ.141.84 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. సాస్కి(స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌, యూనియన్‌ టెరిటోరిస్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌) పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు వెల్లడించారు. పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు దేశ వ్యాప్తంగా 40 ప్రాజెక్టులను ఎంపిక చేసిన కేంద్రం సాస్కి కింద రూ.3,295.76 కోట్ల నిధులను మంజూరు చేసింది. 50 ఏళ్ల కాల వ్యవధితో వడ్డీరహిత రుణం రూపంలో కేంద్రం ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా రామప్ప రీజియన్‌ సస్టెయినబుల్‌ టూరిజం సర్క్యూట్‌ ప్రాజెక్టుకు రూ.73.74 కోట్లు, సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ నల్లమల ప్రాజెక్టుకు రూ.68.10 కోట్లు కలిపి రూ.141.84 కోట్లను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గండికోటకు రూ.77.91 కోట్లు, అఖండ గోదావరి, రాజమహేంద్రవరం ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లు కేటాయించింది. కాగా, సద్వేశ్‌ దర్శన్‌, ప్రసాద్‌, స్వదేశ్‌ దర్శన్‌ 2.0 తదితర పథకాల కింద రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేసిందని కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


  • గడ్కరీతో డీకే అరుణ భేటీ..

తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రహదారులను ఇతర మార్గాలతో అనుసంధానించాలని, విస్తరణ పనులు చేపట్టాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆమె భేటీ అయ్యారు. రహదారుల అభివృద్ధికి సంబంధించి వినతి పత్రాలు అందించారు. కల్వకుర్తి-కరివెన(ఎన్‌హెచ్‌-167కే) జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని, దీనిలో భాగంగా సోమశిల వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.


  • కేటీఆర్‌కు మెదడు లేదు: రఘునందన్‌

మాజీ మంత్రి కేటీఆర్‌ పనికిమాలిన ప్రకటనలు చూస్తుంటే ఆయన అధికారంతోపాటు మెదడు కూడా కోల్పోయారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఘాటుగా స్పందించారు. తాము కాంగ్రె్‌సతో కలిసి ఉంటే చర్లపల్లి జైలులో కేటీఆర్‌ చిప్పకూడు తింటూ ఉండేవాడని కౌంటర్‌ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

Updated Date - Nov 30 , 2024 | 04:58 AM