Bandi Sanjay: కమీషన్లు ఇస్తేనే బిల్లుల మంజూరు
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:37 AM
కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు.

రాష్ట్రంలో మంత్రుల మధ్య అంతర్యుద్ధం
సీఎం రేవంత్‌కు, అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడింది
రేవంత్‌లో గొప్ప నాయకుడు ఎలా కనిపించారో.. పవన్ కల్యాణ్‌కే తెలియాలి: కేంద్ర మంత్రి సంజయ్
కరీంనగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పించాలని కోరుతూ తాజా మాజీ సర్పంచ్‌ల సంఘం నాయకులు కరీంనగర్‌లో సోమవారం బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ బిల్లు మంజూరు చేయాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో కొందరు నిజాయితీపరులైన మంత్రులు ఉన్నారని, కమీషన్ల విషయం వారికి ఏమాత్రం నచ్చడం లేదన్నారు. బిల్లులు, కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోందని దుయ్యబట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ .. సమస్యల పరిష్కారంపై లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలమంది మాజీ సర్పంచ్‌లకు రూ.1300కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. వీరి పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని, కాంగ్రెస్ మెడలు వంచి బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు వల్లే నేరాలు పెరిగాయని సంజయ్ విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు 28 శాతం పెరిగాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేని చేతగాని సర్కార్ ఉందని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు.. క్రైం రేటు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డిలో గొప్ప నాయకుడు ఎలా కన్పించారో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కే తెలియాలి. అల్లు అర్జున్‌కు రేవంత్‌కు ఎక్కడో చెడింది. అది గంటల తరబడి చర్చించాల్సిన అంశమే కాదు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిన అవసరం ఏముంది? అల్లు అర్జున్‌పై కేసును విరమించుకున్నట్లు మృతురాలి భర్త ప్రకటించారు. ఇంకా దీనిపై రాద్ధాంతం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్సేనని, భారతరత్న ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును ఎందుకు అవమానించారని నిలదీశారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ సూపర్ పవర్‌గా వ్యవహరించడం, పీఎంను రబ్బను స్టాంప్‌గా తయారుచేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు.