Share News

Amit Kumar: మూసీ అభివృద్ధి సాధ్యమే!

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:14 AM

మూసీ పునరుజ్జీవం, అభివృద్ధి ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనని.. అయితే ఇందుకు ప్రాజెక్టును అమలు చేయాలన్న గట్టి సంకల్పం, రాజకీయ నిబద్ధత అవసరం అని దక్షిణ కోరియాలో భారత రాయబారి అమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Amit Kumar: మూసీ అభివృద్ధి సాధ్యమే!

  • కావాల్సింది గట్టి సంకల్పం, రాజకీయ నిబద్ధతే!

  • స్కిల్స్‌ యూనివర్సిటీ చక్కని ముందడుగు

  • మీడియాతో భారత రాయబారి అమిత్‌ కుమార్‌

  • హైదరాబాద్‌లో స్కిల్‌ వర్సిటీ భేష్‌

  • కొరియాలో షిప్పింగ్‌, సెమీ కండక్టర్స్‌ రంగాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు

  • దేశ తలసరి ఆదాయం రూ.25లక్షలు.. 12వ తరగతి దాకా ఉచిత విద్య

  • దక్షిణ కొరియాలో భారత రాయబారి అమిత్‌.. మీడియాతో ఇష్టాగోష్టి

(సియోల్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి): మూసీ పునరుజ్జీవం, అభివృద్ధి ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనని.. అయితే ఇందుకు ప్రాజెక్టును అమలు చేయాలన్న గట్టి సంకల్పం, రాజకీయ నిబద్ధత అవసరం అని దక్షిణ కోరియాలో భారత రాయబారి అమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. నదుల అభివృద్ధి అనేది దక్షిణ కొరియా అభివృద్ధికి బాటలు పరిచిందని చెప్పారు. ఒకప్పుడు పేద దేశంగా ఉన్న దక్షిణ కొరియా కేవలం 30 ఏళ్లలో స్వశక్తితో అద్భుతమైన పురోగతి సాధించి, అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించిందని చెప్పారు. దక్షిణ కొరియా తలసరి ఆదాయం సుమారు రూ. 25లక్షలు (30వేల అమెరికన్‌ డాలర్లు) అని.. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ బాగుందన్నారు.


నైపుణ్యాల అభివృద్ధిలో దక్షిణ కొరియానే ఎప్పుడూ నంబర్‌ వన్‌గా ఉంటుందని, హైదరాబాద్‌లో స్కిల్‌ యూనివర్సిటీని పెట్టాలని సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దాన్ని ప్రారంభించడం మంచి ముందడుగు అని కితాబిచ్చారు. రేవంత్‌ రెడ్డి ఇటీవల సియోల్‌ వచ్చినప్పుడు ఇక్కడి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ విభాగానికి చెందిన అధికారులు, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ అధికారులతో చర్చించారని.. సహకారం కోసం చర్చలు జరిగాయని, అవి ఫలప్రదమవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం సందర్శన సందర్భంగా ఇక్కడి అధికారులతో చర్చించిన అంశాలను... మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు చేసిన చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టామని వివరించారు. సియోల్‌ పర్యటన కు వచ్చిన పాత్రికేయ బృందంతో ఎంబసీలోని కార్యాలయంలో అమిత్‌ కుమార్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.


  • షిప్పింగ్‌ రంగంలో భారతీయులకు అవకాశాలు

దక్షిణ కొరియాలో షిప్పింగ్‌ పరిశ్రమ, సెమీ కండక్టర్స్‌, ఆటోమొబైల్‌, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ రంగాల్లో రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. షిప్పింగ్‌ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్‌ నుంచి 200 మందిని తీసుకొచ్చామని చెప్పారు. ఈ రంగంలో భారత్‌కు చెందినవారు పనిచేయడానికి కొరియా వచ్చేందుకు రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయిలో ఒప్పందం జరగాలని అభిప్రాపడ్డారు. దక్షిణ కొరియాకు సంబంధించిన షిప్పింగ్‌ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది 60ఏళ్లకు సమీపంలోకి వచ్చేశారని... ఇంకో పదేళ్లలో వీరు పనిచేసే స్థితిలో ఉండరన్నారు. అందుకే ఈ రంగంలో భారతీయులకు అనేక అవకాశాలుంటాయన్నారు. ఈ దేశంలో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతుందన్నారు. అక్షరాస్యత వందశాతం అనడం కంటే దాదాపు అంతా గ్రాడ్యుయేషన్‌ చేసినవాళ్లే ఉంటారని చెప్పారు. భారత్‌-కొరియాల వాణిజ్య పరిమాణం ఏటా 25బిలియన్‌ డాలర్లన్నారు. దక్షిణ కొరియా నుంచి భారత్‌కు వచ్చే ఎగుమతులే ఇందులో ఎక్కువని... దీన్ని సమతూకం చేసేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో మొత్తం 15వేలమంది భారతీయులున్నారని వెల్లడించారు.


  • దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుతోంది

దక్షిణ కొరియా ప్రధానంగా రెండు సమస్యలను ఎదుర్కొంటోందని అమిత్‌ తెలిపారు. ఈ దేశం చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోందని, అయితే క్రమంగా వాటిని తగ్గించుకునేందుకు ఇక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తాజా అంచనాల ప్రకారం జననాల రేటు 6.8శాతం మాత్రమే ఉందన్నారు. ఈ దేశంలో పరిశోధనలపై ఎక్కువగా ఖర్చుపెడతారని, పెద్ద కంపెనీలు భారీ మొత్తాల్లో సొమ్మును వెచ్చిస్తాయన్నారు. కార్ల తయారీ రంగంలో, హైడ్రోజన్‌ మొబిలిటీ దిశగా పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. హ్యుందయ్‌ కంపెనీ ఐపీవోకు వెళ్లడం ఊహించలేదని, భారత్‌లోని తన వ్యాపార విస్తరణ లక్ష్యాల కోసమే ఈ పనిచేసి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 03:14 AM