Share News

KTR: ఫార్ములా-ఈ రేస్‌.. కేటీఆర్‌పై కేసు!

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:49 AM

ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కే

KTR: ఫార్ములా-ఈ రేస్‌.. కేటీఆర్‌పై కేసు!

  • రేపోమాపో ఏసీబీ నోటీసులు

  • దర్యాప్తునకు గవర్నర్‌ అనుమతి

  • చట్టపరంగా విచారించేందుకు

  • మార్గం సుగమం

  • ఇప్పటికే అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించిన ఏసీబీ

  • విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు ఇవ్వడంపై విచారణ

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు గవర్నర్‌ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్‌కు పంపింది. అది గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. పలువురు మంత్రులు.. గవర్నర్‌ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏసీబీ దర్యాప్తు, కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతించినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఏసీబీ కోర్టుకు పంపించే కసరత్తు ప్రారంభించారు. ఆ తర్వాత కేటీఆర్‌కు నోటీసులు జారీ కానున్నాయి.


నాలుగేళ్లకు ఒప్పందం..

హైదరాబాద్‌లో నాలుగేళ్ల పాటు ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణకు సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో), ఎస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కలిసి పురపాలక శాఖ అధికారులు 2022 అక్టోబరు 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. దీంతో 2023 ఫిబ్రవరిలో తొలి ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహించారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఈ ఒప్పందం నుంచి ప్రమోటర్‌ కంపెనీ వైదొలగింది. దీంతో 2024లో రెండో సెషన్‌ రేస్‌ నుంచి హైదరాబాద్‌ పేరును ఎఫ్‌ఈవో తొలగించింది. రంగంలోకి దిగిన నాటి మంత్రి కేటీఆర్‌.. 2024లో కూడా హైదరాబాద్‌లోనే రేస్‌ నిర్వహించాలని, నోడల్‌ ఏజెన్సీగా హెచ్‌ఎండీఏ ఉంటుందని ఎఫ్‌ఈవోకు తెలిపారు. దీంతో ఎఫ్‌ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్‌ నిర్వహణకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వెంటనే పురపాలక శాఖ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రేస్‌పై ఆరా తీసింది.


ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.55 కోట్లు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణించింది. నాటి పురపాలక శాఖ కార్యదర్శి అర్విందకుమార్‌ను బదిలీ చేసి విచారణకు ఆదేశించింది. రూ.55 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని అర్విందకుమార్‌కు సీఎస్‌ శాంతికుమారి మెమో ఇవ్వగా.. నాటి మంత్రి కేటీఆర్‌ మౌఖిక ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు అర్వింద్‌కుమార్‌ జవాబిచ్చారు. ఒక విదేశీ కంపెనీకి, విదేశీ కరెన్సీలో నిధుల చెల్లింపు జరిగినప్పుడు పాటించాల్సిన నిబంధనలను నాటి అధికారులు పాటించకపోవడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే అర్విందకుమార్‌తో పాటు పలువురు పురపాలకశాఖ అధికారుల నుంచి ఏసీబీ వివరాలు సేకరించింది. తాజాగా గవర్నర్‌ అనుమతులు రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే కేటీఆర్‌తో పాటు కొందరు అధికారులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.

Updated Date - Dec 14 , 2024 | 03:49 AM