Share News

TG: కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

ABN , Publish Date - May 02 , 2024 | 05:08 AM

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది.

TG: కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

  • ఎన్నికల సంఘం ఉత్తర్వులు

  • కాంగ్రెస్‌ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు

  • గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై

  • ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్‌

  • ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ

  • మోదీ మతవిద్వేష వ్యాఖ్యలు,

  • రేవంత్‌ బూతులు ఈసీకి వినపడవా?

  • తీవ్రంగా ఖండించిన కేటీఆర్‌, హరీశ్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సిరిసిల్ల, మహబూబాబాద్‌, చిన్నకోడూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు.. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్దతండా క్రాస్‌రోడ్డు వద్ద కేసీఆర్‌కు అందజేశారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బయలుదేరిన బస్సుయాత్రను పెద్దతండా వద్ద ఆపిన అధికారు లు ఉత్తర్వులను అందజేసి కేసీఆర్‌ సంతకాలు తీసుకున్నారు. దీంతో, షెడ్యూల్‌ ప్రకారం గురువారం జమ్మికుంటలో నిర్వహించాల్సిన రోడ్‌షోను కేసీఆర్‌ రద్దు చేసుకున్నారు. మహబూబాబాద్‌లో ప్రచారం అనంతరం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలే కారణం

ఏప్రిల్‌ 5వ తేదీన సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ పార్టీపై, సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏప్రిల్‌ 17న ఈసీ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. నోటీసులకు కేసీఆర్‌ వివరణ ఇస్తూ.. సిరిసిల్లలో ఎన్నికల ఇంచార్జులుగా ఉన్న అధికారులు తెలుగువారు కాదని, వారికి తెలుగు మాండలికం తెలియదని పేర్కొన్నారు. సందర్భానుసారంగా చెప్పిన కొన్ని మాటలను తీసుకుని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిందని, ఆంగ్ల అనువాదంలో వాటిని వక్రీకరించారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలపైన మాత్రమే విమర్శలు చేశానని, ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయలేదని పేర్కొన్నారు.


పరిశీలించిన ఈసీ.. కేసీఆర్‌ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారని పేర్కొంటూ తాజాగా ఆయన ప్రచారంపై 48 గంటల నిషేధాన్ని విధించింది. ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ ఎటువంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటర్వ్యూలలో పాల్గొనరాదని, ఎలకా్ట్రనిక్‌, ప్రింట్‌, సోషల్‌ మీడియాలో బహిరంగ ప్రకటనలు చేయరాదని ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సిరిసిల్లలో మీడియా సమావేశంలో కాంగ్రె్‌సపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు, మందలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.

కాంగ్రె్‌సపై అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ఎన్నికల నియమావళిని, కమిషన్‌ ఆదేశాలు, సూచనలను కేసీఆర్‌ ఉల్లంఘించారని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా నిబంధనలను ఉల్లంఘించారని హెచ్చరించామని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సలహా ఇచ్చామని కేసీఆర్‌కు ఈసీ గుర్తు చేసింది.


ఇదెక్కడి అరాచకం?: కేటీఆర్‌

కేసీఆర్‌పై ఈసీ నిషేధాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘తెలంగాణ ఆవాజ్‌ అయిన కేసీఆర్‌ గొంతుపై నిషేధమా? ఇదెక్కడి అరాచకం? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలపై వేలాది మంది పౌరులు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌పైనా విమర్శలు గుప్పిస్తూ.. రేవంత్‌ బూతులు ఈసీకి ప్రవచనాల్లా అనిపించాయా? అని పేర్కొన్నారు.


‘ఇది బడే భాయ్‌.. చోటే భాయ్‌ కలిసి చేసిన కుట్ర కాదా? కేసీఆర్‌ పోరుబాట చూసి బీజేపీ, కాంగ్రెస్‌ ఎందుకు వణుకుతున్నాయి? మీ అహంకారానికి అధికార దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారు’ అని కేటీఆర్‌ హెచ్చరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు స్పందిస్తూ.. కేసీఆర్‌ బస్సు యాత్రకు బయల్దేరితే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు గజ గజ వణుకుతున్నారని విమర్శించారు. మోదీ మతవిద్వేషాలు రెచ్చగొడితే, రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడితే ఈసీకి వినిపించవా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను రెండురోజులు అపినంత మాత్రాన ఏమవుతుందని, ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు.


కేసీఆర్‌ వ్యాఖ్యలు ఇవీ..

గత నెల 5వ తేదీన.. ఎండిన పంటల పరిశీలన కోసం కరీంనగర్‌, సిరిసిల్ల ప్రాంతాల్లో కేసీఆర్‌ బస్సు యాత్ర నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి.. ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలు ఇవీ..

‘ప్రస్తుత ప్రభుత్వం తెలివితక్కువ, అసమర్థ, అవివేక, అర్భక, చవట విధానాల వల్లనే నాశనానికి వచ్చింది; నీటి నిల్వ సామర్థ్యం తెల్వని లత్‌కోర్‌లు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నరు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది; తప్పించుకోవాలని అనుకుంటే ప్రజలు వీపు విమానం మోత మోగిస్తారు. వదిలిపెట్టరు; కాళేశ్వరం పంప్‌లను అన్‌చేసి వరదకాలువకు నీళ్లు వదిలారని సిగ్గులేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతాడు; సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యేటట్లు ఉన్నాయి. ఓ కాంగ్రెసోడు నిరోధ్‌లు, పాపుడాలు అమ్ముకుని బతకమని అంటడు. నిరోధ్‌లు అమ్ముకొని బతకాల్నా కుక్కల కొడుకుల్లారా? చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా; చేనేత కార్మికులను మొన్నటిదాకా దొబ్బితిన్నరు.. దోచుకుతిన్నరని అంటారా దొంగ నా కొడుకుల్లారా; రూ.500 బోనస్‌ ఇవ్వకపోతే గొంతు కొరికి చంపుతాం.’

Updated Date - May 02 , 2024 | 05:08 AM