Share News

Model Colony: ఆ ఇళ్లకు మోక్షం

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:03 AM

సరిగ్గా 11 ఏళ్ల తర్వాత ఆ ఇళ్లకు మోక్షం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో అప్పటి ప్రభుత్వం హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ పరిధిలోని సీతారామస్వామి గుట్ట ప్రాంతంలో 2,160 సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మోడల్‌ కాలనీగా మంజూరు చేసింది.

Model Colony: ఆ ఇళ్లకు మోక్షం

  • 2013లో హుజూర్‌నగర్‌లో 2,160 ఇళ్ల మంజూరు

  • దశాబ్దంగా నిలిచిన పనులు.. ఉత్తమ్‌ చొరవతో షురూ

  • రూ.74 కోట్లు మంజూరు చేసిన గృహ నిర్మాణ సంస్థ

హైదరాబాద్‌, హుజూర్‌నగర్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా 11 ఏళ్ల తర్వాత ఆ ఇళ్లకు మోక్షం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో అప్పటి ప్రభుత్వం హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ పరిధిలోని సీతారామస్వామి గుట్ట ప్రాంతంలో 2,160 సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మోడల్‌ కాలనీగా మంజూరు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు ఆ ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోలేదు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నాయకులు ఆ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని పలుసార్లు ఉద్యమాలు చేశారు. ఇళ్ల సాధన కమిటీ పేరుతో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఆరు నెలల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని నాలుగేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ నాయకులు, ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. చివరికి ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆ ఇళ్లను పరిశీలించి, పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగిపోయిన ఆ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.74.80 కోట్లను మంజూరు చేసింది. ఈమేరకు పనులను ఒక నిర్మాణ సంస్థకు అప్పగించింది.


ఇప్పటి వరకు 1,024 ఇళ్ల పనులు పూర్తవ్వగా.. 832 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. మరో 304 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలనీలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపైనా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తాగునీరు, విద్యుత్‌ లైన్లు, పారిశుధ్య సౌకర్యాలను కూడా ఇళ్ల నిర్మాణాలతో పాటు పూర్తిచేయనున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ 10 రోజులకోసారి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఇళ్లన్నిటినీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని గృహ నిర్మాణ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులతో పాటు ఆ ప్రాంతంలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారని గృహ నిర్మాణ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ మోడల్‌ కాలనీ నిర్మాణం త్వరితంగా పూర్తిచేసి పేదల ఇందిరమ్మ ఇంటి కల నెరవేర్చుతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలియజేశారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 05:03 AM