Share News

IPL Semi final : రయ్‌ రయ్‌.. రైజర్స్‌

ABN , Publish Date - May 25 , 2024 | 05:45 AM

చివరి మూడు సీజన్లలో దాదాపు అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి అనుకున్నది సాధించింది. తమ టైటిల్‌ వేటకు మరో అడుగు దూరంలో నిలిచింది. అయితే బ్యాటింగ్‌లో హార్డ్‌ హిట్టర్లు ఆశించిన రీతిలో రాణించకపోయినా.. ఓ మాదిరి స్కోరును బౌలర్లు మాత్రం అద్భుతరీతిలో కాపాడారు. ముఖ్యంగా లెఫ్టామ్‌

IPL Semi final : రయ్‌ రయ్‌.. రైజర్స్‌

మూడోసారి ఫైనల్లో హైదరాబాద్‌

క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌కు నిరాశ

రేపు కోల్‌కతాతో టైటిల్‌ ఫైట్‌కు సై

రాణించిన క్లాసెన్‌ జూ సత్తాచాటిన షాబాజ్‌, అభిషేక్‌

చెన్నై: చివరి మూడు సీజన్లలో దాదాపు అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి అనుకున్నది సాధించింది. తమ టైటిల్‌ వేటకు మరో అడుగు దూరంలో నిలిచింది. అయితే బ్యాటింగ్‌లో హార్డ్‌ హిట్టర్లు ఆశించిన రీతిలో రాణించకపోయినా.. ఓ మాదిరి స్కోరును బౌలర్లు మాత్రం అద్భుతరీతిలో కాపాడారు. ముఖ్యంగా లెఫ్టామ్‌ స్పిన్నర్లు షాబాజ్‌ అహ్మద్‌ (3/23), అభిషేక్‌ (2/24) మ్యాజిక్‌ బంతులతో ప్రత్యర్థి వెన్నువిరిచారు. దీంతో క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌పై 36 పరుగుల తేడాతో నెగ్గిన సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ జట్టుకిది మూడో ఫైనల్‌ కాగా 2016లో చాంపియన్‌గా నిలిచింది. అటు రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం బ్యాటింగ్‌ వైఫల్యంతో చక్కటి అవకాశాన్ని చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. క్లాసెన్‌ (34 బంతుల్లో 4 సిక్సర్లతో 50), త్రిపాఠి (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), హెడ్‌ (28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) రాణించారు. అవేశ్‌, బౌల్ట్‌లకు మూడేసి, సందీ్‌పకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 139 పరుగులే చేసి ఓడింది. జురెల్‌ (35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 నాటౌట్‌), జైస్వాల్‌ (21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) మాత్రమే పోరాడారు. నటరాజన్‌, కమిన్స్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షాబాజ్‌ నిలిచాడు.

బ్యాటర్ల తడబాటు: ఓ మాదిరి ఛేదనే అయినా రాజస్థాన్‌ బ్యాటర్లలో నిలకడ లోపించింది. కాస్త ఓపిగ్గా నిలబడితే రన్స్‌ వచ్చే అవకాశం ఉన్నా.. వికెట్లను కాపాడుకోలేకపోయింది. ఓపెనర్‌ జైస్వాల్‌ ఆటతీరుకు మిగతా వారికి పొంతన లేకపోయింది. ఆఖర్లో ధ్రువ్‌ జురెల్‌ పోరాటం ఏమాత్రం సరిపోలేదు. స్పిన్నర్లు షాబాజ్‌, అభిషేక్‌ అద్భుత బంతులతో రన్స్‌ను కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్లతో చావుదెబ్బ తీశారు. తొలి ఐదు ఓవర్లలో ఓపెనర్‌ క్యాడ్‌మోర్‌ (10) వికెట్‌తో పాటు ఆర్‌ఆర్‌ 32 పరుగులే చేసింది. కానీ ఆరో ఓవర్‌లో జైస్వాల్‌ చెలరేగి 6,4,4,4తో 19 రన్స్‌ రాబట్టడంతో పవర్‌ప్లేలో 51/1 స్కోరుతో కోలుకుంది. క్రీజులో అతడికి జతగా శాంసన్‌ (10) కూడా ఉండడంతో ఇక స్కోరు గాడినపడినట్టే అని భావించినా.. స్పిన్నర్లు గట్టి దెబ్బ తీశారు. వరుస ఓవర్లలో జైస్వాల్‌ను షాబాజ్‌, శాంసన్‌ను అభిషేక్‌ అవుట్‌ చేయడంతో రాయల్స్‌ షాక్‌లో మునిగింది. దీనికి తోడు 12వ ఓవర్‌లో పరాగ్‌ (6), అశ్విన్‌ (0)ల వికెట్లు తీసిన షాబాజ్‌ కోలుకోలేని షాకిచ్చాడు. అలాగే 9-12 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ధ్రువ్‌ జురెల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 34 బంతుల తర్వాత ఓ సిక్సర్‌ నమోదైంది. అలాగే 15, 16వ ఓవర్లలో రెండేసి ఫోర్లతో జోరు చూపాడు. కానీ 18వ ఓవర్‌లో నటరాజన్‌ ఒక్క పరుగిచ్చి పోవెల్‌ (6) వికెట్‌ తీయడంతో ఇక చేసేదేమీలేకపోయింది. జురెల్‌ 19వ ఓవర్‌లో రెండు ఫోర్లతో 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆఖరి ఓవర్‌లో 42 రన్స్‌ చేయాల్సిన వేళ రాజస్థాన్‌ చేతులెత్తేసింది.


పేసర్ల హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను పేసర్‌ బౌల్ట్‌ ఆరంభంలోనే బెంబేలెత్తించగా, డెత్‌ ఓవర్లలో అవేశ్‌, సందీప్‌ సత్తా చాటారు. అయితే క్లాసెన్‌, రాహుల్‌ త్రిపాఠి జోరుతో రైజర్స్‌ సవాల్‌ విసిరే స్కోరు సాధించింది. ఇక ఓపెనర్‌ హెడ్‌ పది ఓవర్ల వరకు క్రీజులోనే ఉన్నా అతడి ఆటలో దూకుడు కనిపించలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ అభిషేక్‌ (12)ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చాడు. కానీ త్రిపాఠి ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. తానే ఎక్కువగా స్ట్రయిక్‌ తీసుకుంటూ నాలుగో ఓవర్‌లో వరుసగా 4,4,6తో చెలరేగాడు. తర్వాతి ఓవర్‌లో తొలి రెండు బంతులను 6,4గా మలిచి అదుర్స్‌ అనిపించాడు. కానీ బౌల్ట్‌ స్లో బంతితో త్రిపాఠి వికెట్‌ తీయడంతో రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే ఆరో బంతికి మార్‌క్రమ్‌ (1)ను కూడా బౌల్ట్‌ అవుట్‌ చేయడంతో 57/3 స్కోరుతో రైజర్స్‌ ఇబ్బందుల్లో పడింది. అటు హెడ్‌ రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో 68 రన్స్‌ చేసింది. అలాగే అవేశ్‌ ఓవర్‌లో 6,4తో హెడ్‌ కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ మధ్య ఓవర్లలో స్పిన్నర్లు చాహల్‌, అశ్విన్‌ పరుగులను నియంత్రించారు. దీంతో హెడ్‌, క్లాసెన్‌ భారీషాట్లు ఆడలేక ఇబ్బందిపడ్డారు. మరోవైపు పదో ఓవర్‌లో హెడ్‌ను పేసర్‌ సందీప్‌ అవుట్‌ చేయగా.. 14వ ఓవర్‌లో నితీశ్‌ (5), సమద్‌ (0)ల వికెట్లతో అవేశ్‌ డబుల్‌ షాక్‌ ఇచ్చాడు. ఈ దశలో క్లాసెన్‌ నిలకడను ప్రదర్శిస్తూ బాధ్యతను తీసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేస్తూ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అతడికి మరో ఎండ్‌లో షాబాజ్‌ (18) సహకరించడంతో ఏడో వికెట్‌కు 43 పరుగులు జమయ్యాయి. 19వ ఓవర్‌లో సందీప్‌ అద్భుత బంతికి క్లాసెన్‌ బౌల్డవ్వడంతో పాటు.. ఆఖరి ఓవర్‌లో అవేశ్‌ ఏడు రన్స్‌ ఇచ్చి షాబాజ్‌ వికెట్‌ తీశాడు.

ఈ సీజన్‌ పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు (12) తీసిన బౌలర్‌గా బౌల్ట్‌.

ఐపీఎల్‌లో ఫైనల్‌ చేరడం సన్‌రైజర్స్‌కిది మూడోసారి. 2016లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌, 2018లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఐపీఎల్‌లో ఎక్కువ సిక్సర్లు (224) సమర్పించుకున్న బౌలర్‌గా చాహల్‌

స్కోరుబోర్డు

హైదరాబాద్‌: హెడ్‌ (సి) అశ్విన్‌ (బి) సందీప్‌ 34, అభిషేక్‌ (సి) క్యాడ్‌మోర్‌ (బి) బౌల్ట్‌ 12, త్రిపాఠి (సి) చాహల్‌ (బి) బౌల్ట్‌ 37, మార్‌క్రమ్‌ (సి) చాహల్‌ (బి) బౌల్ట్‌ 1, క్లాసెన్‌ (బి) సందీప్‌ 50, నితీశ్‌ (సి) చాహల్‌ (బి) అవేశ్‌ 5, సమద్‌ (బి) అవేశ్‌ 0, షాబాజ్‌ (సి) జురెల్‌ (బి) అవేశ్‌ 18, కమిన్స్‌ (నాటౌట్‌) 5, ఉనాద్కట్‌ (రనౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 175/9; వికెట్ల పతనం: 1-13, 2-55, 3-57, 4-99, 5-120, 6-120, 7-163, 8-170, 9-175; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-45-3, అశ్విన్‌ 4-0-43-0, సందీప్‌ 4-0-25-2, అవేశ్‌ 4-0-27-3, చాహల్‌ 4-0-34-0.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) సమద్‌ (బి) షాబాజ్‌ 42, క్యాడ్‌మోర్‌ (సి) త్రిపాఠి (బి) అభిషేక్‌ 10, శాంసన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) అభిషేక్‌ 10, పరాగ్‌ (సి) అభిషేక్‌ (బి) షాబాజ్‌ 6, జురెల్‌ (నాటౌట్‌) 56, అశ్విన్‌ (సి) క్లాసెన్‌ (బి) షాబాజ్‌ 0, హెట్‌మయెర్‌ (బి) అభిషేక్‌ 4, పొవెల్‌ (సి) అభిషేక్‌ (బి) నటరాజన్‌ 6, బౌల్ట్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 139/7; వికెట్ల పతనం: 1-24, 2-65, 3-67, 4-79, 5-79, 6-92, 7-124; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-33-0, కమిన్స్‌ 4-0- 30-1, నటరాజన్‌ 3-0-13-1, ఉనాద్కట్‌ 1-0-5-0, షాబాజ్‌ 4-0-23-3, అభిషేక్‌ 4-0-24-2, మార్‌క్రమ్‌ 1-0-10-0.

Updated Date - May 25 , 2024 | 08:06 AM