Share News

IPL Season 17 Winner Kolkata : కోల్‌కతా కుమ్మేసింది

ABN , Publish Date - May 27 , 2024 | 04:47 AM

లీగ్‌ దశలోనే కాదు.. ఫైనల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్‌-17వ సీజన్‌లో శ్రేయాస్‌ సేన చాంపియన్‌గా

IPL Season 17 Winner Kolkata : కోల్‌కతా కుమ్మేసింది

  • విజృంభించిన బౌలర్లు

  • చెలరేగిన వెంకటేశ్‌

  • ఆఖరాటలో సన్‌రైజర్స్‌ సూపర్‌ ఫ్లాప్‌ షో

  • ఐపీఎల్‌ చాంపియన్‌ నైట్‌రైడర్స్‌

  • వన్‌సైడ్‌ రైడింగ్‌

  • ఐపీఎల్‌ ఫైనల్లో తేలిపోయిన హైదరాబాద్‌

  • బ్యాటింగ్‌లో 113 పరుగుల అత్యల్ప స్కోరు

  • బౌలింగ్‌ పేలవం.. అభిమానులకు నిరాశ

  • కోల్‌కతా చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తు

  • మూడోసారి టైటిల్‌ కొట్టిన నైట్‌ రైడర్స్‌

చాంపియన్‌కు- రూ. 20 కోట్లు

రన్నర్‌పనకు - రూ. 12.50 కోట్లు

మూడోస్థానం జట్టుకు - రూ. 7 కోట్లు

నాలుగోస్థానం జట్టుకు - రూ. 6.5 కోట్లు

టీ20 చరిత్రలోనే అత్యంత భారీ స్కోరు సాధించిన జట్టు.. వారి బ్యాటర్లు బరిలోకి దిగితే బౌలర్లు చేష్టలుడిగిపోవాల్సిందే.. ఈ ఒక్క సీజన్‌లోనే 287, 277, 266 పరుగులతో వామ్మో..

అనిపించారు. కానీ ఏం లాభం. అత్యంత కీలక ఫైనల్లో కనీసం 120 పరుగులు కూడా సాధించలేక బ్యాటర్లంతా తుస్సుమన్నారు. తొమ్మిదో నెంబర్‌ బ్యాటర్‌ కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌ అంటే వీరి ఆటతీరేమిటో తెలిసిపోతుంది. ఫలితం.. దారుణ పరాభవం.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరోసారి సమష్ఠి ఆటతీరుతో కుమ్మేసింది. టాస్‌ ఫలితంతో సంబంధం లేకుండా బంతి చేతపట్టిన ప్రతీ బౌలర్‌ వికెట్ల వేట సాగించగా.. రైజర్స్‌ బ్యాటర్లు తమకు బ్యాటింగే రానట్టుగా పెవిలియన్‌ బాట పట్టారు. అటు స్వల్ప ఛేదనలో వెంకటేశ్‌ అయ్యర్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగి కేవలం 10.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా ఫైనల్‌ను ముగించిన కోల్‌కతా చెపాక్‌లో ‘తీన్‌మార్‌’తో చిందులు వేసింది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) చెన్నై: లీగ్‌ దశలోనే కాదు.. ఫైనల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్‌-17వ సీజన్‌లో శ్రేయాస్‌ సేన చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా ముగిసిన తుదిపోరులో 8 వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. 2012లోనూ కేకేఆర్‌ తొలిసారి ఇదే వేదికపై టైటిల్‌ గెలవడం విశేషం. కేకేఆర్‌ తరఫున బరిలోకి దిగిన ఆరుగురు బౌలర్లూ వికెట్లు తీశారు. ఆరంభంలో స్టార్క్‌ (2/14), చివర్లో రస్సెల్‌ (3/19) రైజర్స్‌కు ముకుతాడు వేశారు. బ్యాటింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీ సాధించాడు. ముందుగా సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్‌ (24), మార్‌క్రమ్‌ (20) మాత్రమే ఓ మాదిరిగా ఆడారు. హర్షిత్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 రన్స్‌ చేసి గెలిచింది. గుర్బాజ్‌ (39) ఆకట్టుకున్నాడు. కమిన్స్‌, షాబాజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా స్టార్క్‌ నిలిచాడు.


63 బంతుల్లోనే..: సునాయాస ఛేదనలో కోల్‌కతాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. పిచ్‌ ఎలా ఉన్నా వెంకటేశ్‌ అయ్యర్‌ బాదుడునే నమ్ముకుని ఆరంభం నుంచే పరుగులు పిండుకున్నాడు. ఓపెనర్‌ గుర్బాజ్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు. ఓపెనర్‌ నరైన్‌ (6)ను రెండో ఓవర్‌లోనే కమిన్స్‌ అవుట్‌ చేసినప్పటికీ.. ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తూ వెంకటేశ్‌ విరుచుకుపడ్డాడు. మూడో ఓవర్‌లో అతడు 4,6,6తో 20 రన్స్‌ రాబట్టగా, ఆరో ఓవర్‌లోనూ వరుసగా 4,4,6,4తో మరో 20 రన్స్‌తో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలోనే 72/1 స్కోరు రావడంతో సగానికి పైగా కేకేఆర్‌ ఛేదన పూర్తయింది. అటు తొమ్మిదో ఓవర్‌లో గుర్బాజ్‌ సిక్సర్‌తో జట్టు స్కోరు వందకు చేరింది. కానీ అదే ఓవర్‌లో షాబాజ్‌ అతడిని ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి విజయానికి 67 బంతుల్లో కేవలం 12 పరుగులే అవసరమయ్యాయి. శ్రేయాస్‌ (6 నాటౌట్‌) వచ్చీ రాగానే ఫోర్‌ బాదగా.. అటు వెంకటేశ్‌ 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివరకు 10.3వ ఓవర్‌లో ఓ సింగిల్‌తో కోల్‌కతా సంబరాలు మిన్నంటగా.. రైజర్స్‌ నిరాశతో మైదానం వీడింది.

venkatesh-iyer.jpg

వెంకటేశ్‌ అయ్యర్‌ (26 బంతుల్లో 52 నాటౌట్‌)


కుప్పకూల్చారు: టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ భారీస్కోరు ఆశతో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. హార్డ్‌ హిట్టర్లతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ అద్భుతాలు చేస్తుందనుకున్నా.. కేకేఆర్‌ బౌలర్ల రాణింపుతో ఒక్కో పరుగు కోసం చెమటోడ్చింది. స్వింగ్‌, బౌన్స్‌తో పాటు బంతిపై చక్కటి పట్టు దొరకడంతో పేసర్లు, స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. కానీ పిచ్‌ ఎంత మందకొడిగా ఉన్నా రైజర్స్‌ బ్యాటర్లు 120 పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. ఆఖర్లో కమిన్స్‌ కాసేపు నిలవడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 21 పరుగులకే టాపార్డర్‌ వెనుదిరగడం కూడా దెబ్బతీసింది. కొత్త బంతితో స్టార్క్‌ ప్రత్యర్థిని షేక్‌ చేశాడు. తొలి ఓవర్‌లోనే కళ్లు చెదిరే బంతితో ఓపెనర్‌ అభిషేక్‌ (2)ను అవుట్‌ చేయగా.. తర్వాతి ఓవర్‌లోనే అత్యంత ప్రమాదక హెడ్‌ (0)ను పేసర్‌ వైభవ్‌ గోల్డెన్‌ డకౌట్‌తో పంపాడు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో అతడికిది మూడో డకౌట్‌ కాగా.. కేకేఆర్‌తో వరుసగా రెండోది. ఫామ్‌లో ఉన్న రాహుల్‌ త్రిపాఠి (9)తోనైనా స్కోరులో కదలిక వస్తుందనుకుంటే.. స్టార్క్‌ తన మూడో ఓవర్‌లో అతడిని కూడా అవుట్‌ చేశాడు. మార్‌క్రమ్‌ మాత్రం ఈసారి ఓపికను ప్రదర్శించి క్రీజులో నిలబడ్డాడు. ఆరో ఓవర్‌లో అతడి రెండు ఫోర్లు, నితీశ్‌ (13) సిక్సర్‌తో అత్యధికంగా 17 రన్స్‌ వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో జట్టు 40/3 స్కోరుతో నిలిచింది. అయితే నితీశ్‌ మరోసారి విఫలమై హర్షిత్‌ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో మార్‌క్రమ్‌కు క్లాసెన్‌ జత కలవడంతో రైజర్స్‌ కుదురుకుంటుందనుకున్నా నిరాశే ఎదురైంది. రస్సెల్‌ వరుస ఓవర్లలో మార్‌క్రమ్‌, సమద్‌ (4)ల పనిబట్టాడు. 15వ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా హర్షిత్‌.. క్లాసెన్‌ (16)ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో కోల్‌కతా సంబరాల్లో మునిగింది. ఈ దశలో జట్టు స్కోరు 90/8 మాత్రమే. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కెప్టెన్‌ కమిన్స్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే 16వ ఓవర్‌లో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను లాంగాన్‌లో స్టార్క్‌ వదిలేశాడు. ఆ తర్వాత మరో క్యాచ్‌ను రస్సెల్‌ అందుకున్నా బౌండరీ లైన్‌పై పడడంతో సిక్సర్‌గా మారింది. అటు స్కోరు కూడా 100 దాట గలిగింది. అయితే తొమ్మిదో వికెట్‌కు 23 పరుగులు జత చేరాక ఉనాద్కట్‌ (4)ను నరైన్‌ ఎల్బీగా పంపాడు. మరోవైపు రస్సెల్‌ ఓవర్‌లో ఎట్టకేలకు కమిన్స్‌ క్యాచ్‌ను స్టార్క్‌ పట్టేయడంతో రైజర్స్‌ ఆట 19 ఓవర్లలోపే ముగిసింది.


46 అభిషేక్‌ శర్మ కొట్టిన సిక్సర్లు. ఈ సీజన్‌లో ఇవే అత్యధికం. క్లాసెన్‌ (38) రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌ ఫైనల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్‌. అలాగే ఫైనల్లో ఓ టీమ్‌ నుంచి ఒక్క బ్యాటర్‌ కూడా 30 పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి.

ఐపీఎల్‌లో రెండు జట్ల (ఢిల్లీ, కోల్‌కతా) తరఫున ఫైనల్లో ఆడిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌.

బంతుల పరంగా (57) ఐపీఎల్‌ ఫైనల్లో ఇదే అతి భారీ విజయం

ఫైనల్లో అత్యధిక పవర్‌ప్లే (72/1) స్కోరు సాధించిన జట్టుగా కోల్‌కతా

ఓ సీజన్‌లో అతి తక్కువ ఓటములు (3) సాధించిన జట్టుగా రాజస్థాన్‌ (2008)తో సమంగా నిలిచిన కోల్‌కతా

ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు (287) సాధించడమే కాకుండా ఫైనల్లోనూ స్వల్ప స్కోరు (113) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కిది రెండో అత్యల్ప స్కోరు (113). గతంలో 96, 113 పరుగులు చేసింది.

కోల్‌కతాకిది మూడో ఐపీఎల్‌ టైటిల్‌. గంభీర్‌ సారథ్యంలో 2012, 2014లో విజేతగా నిలిచింది.

ఈ సీజన్‌లో నమోదైన మొత్తం సెంచరీలు. బట్లర్‌ అత్యధికంగా 2 శతకాలు బాదగా.. కోహ్లీ, జైస్వాల్‌, సూర్యకుమార్‌, విల్‌ జాక్స్‌, బెయిర్‌స్టో, సాయి సుదర్శన్‌, గిల్‌, నరైన్‌, రుతురాజ్‌, హెడ్‌, రోహిత్‌, స్టొయినిస్‌ ఒక్కో సెంచరీ కొట్టారు.

పంజాబ్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ పడగొట్టిన వికెట్లు. అత్యధిక వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు.

ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ చేసిన పరుగులివి. అత్యధిక పరుగుల్లో టాప్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (బి) స్టార్క్‌ 2, హెడ్‌ (సి) రహ్మనుల్లా (బి) వైభవ్‌ 0, త్రిపాఠి (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 9, మార్‌క్రమ్‌ (సి) స్టార్క్‌ (బి) రస్సెల్‌ 20, నితీశ్‌ కుమార్‌ (సి) రహ్మనుల్లా (బి) హర్షిత్‌ 13, క్లాసెన్‌ (బి) హర్షిత్‌ 16, షాబాజ్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 8, సమద్‌ (సి) రహ్మనుల్లా (బి) రస్సెల్‌ 4, కమిన్స్‌ (సి) స్టార్క్‌ (బి) రస్సెల్‌ 24, ఉనాద్కట్‌ (ఎల్బీ) నరైన్‌ 4, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 18.3 ఓవర్లలో 113 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-2, 2-6, 3-21, 4-47, 5-62, 6-71, 7-77, 8-90, 9-113, 10-113; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-14-2, వైభవ్‌ అరోరా 3-0-24-1, హర్షిత్‌ రాణా 4-1-24-2, నరైన్‌ 4-0-16-1, రస్సెల్‌ 2.3-0-19-3, వరుణ్‌ చక్రవర్తి 2-0-9-1.

కోల్‌కతా: రహ్మనుల్లా (ఎల్బీ) షాబాజ్‌ 39, నరైన్‌ (సి) షాబాజ్‌ (బి) కమిన్స్‌ 6, వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 52, శ్రేయాస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 10.3 ఓవర్లలో 114/2; వికెట్ల పతనం: 1-11, 2-102; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-25-0, కమిన్స్‌ 2-0-18-1, నటరాజన్‌ 2-0-29-0, షాబాజ్‌ 2.3-0-22-1, ఉనాద్కట్‌ 1-0-9-0, మార్‌క్రమ్‌ 1-0-5-0.


ఈ సీజన్‌ హీరోలు

ఎమర్జింగ్‌ ప్లేయర్‌: నితీష్‌ కుమార్‌ రెడ్డి

స్ట్రయికర్‌ ఆఫ్‌ ది టోర్నీ: జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌

ఫాంటసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ: సునీల్‌ నరైన్‌

క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: రమణ్‌దీప్‌ సింగ్‌

ఫెయిర్‌ ప్లే: సన్‌రైజర్స్‌

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌: సునీల్‌ నరైన్‌

పిచ్‌ అండ్‌ గ్రౌండ్‌ అవార్డు: హెచ్‌సీఏ -50 లక్షలు

Updated Date - May 27 , 2024 | 04:56 AM