Share News

Pakistan Cricket: అల్లుడు అఫ్రిదిని అవమానించిన మామ అఫ్రిది.. ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Jan 01 , 2024 | 07:20 PM

Pakistan Cricket: ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ అల్లుడు అఫ్రిదిని మామ అఫ్రిది అవమానించాడు. తన అల్లుడు అఫ్రిది పొరపాటున పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడని వ్యంగ్యంగా విమర్శించాడు.

Pakistan Cricket: అల్లుడు అఫ్రిదిని అవమానించిన మామ అఫ్రిది.. ఏం జరిగిందంటే..?

పాకిస్థాన్ క్రికెట్‌లో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. ప్రస్తుత స్టార్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది నిజ జీవితంలో మామా అల్లుళ్లు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ అల్లుడు అఫ్రిదిని మామ అఫ్రిది అవమానించాడు. తన అల్లుడు అఫ్రిది పొరపాటున పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడని వ్యంగ్యంగా విమర్శించాడు. తన అల్లుడు అఫ్రిది స్థానంలో వికెట్ కీపర్ రిజ్వాన్‌కు కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా రిజ్వాన్‌పై ప్రసంశలు కురిపించాడు. రిజ్వాన్ కఠోర శ్రమ, ఏకాగ్రత గొప్పగా ఉంటుందని.. అతడిలో నచ్చే విషయం ఏంటంటే.. ఆటపై మాత్రమే ఫోకస్ పెడతాడని తెలిపాడు. రిజ్వాన్ ఒక రియల్ ఫైటర్ అని కీర్తించాడు. పాకిస్థాన్ టీ20 కెప్టెన్‌గా రిజ్వాన్‌ను చూడాలనుకున్నానని.. కానీ పొరపాటున షాహిన్ షా అఫ్రిది అయ్యాడని మామా షాహిద్ అఫ్రిది అన్నాడు.

కాగా ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కనీసం సెమీఫైనల్‌కు కూడా వెళ్లకపోవడంతో బాబర్ ఆజమ్ మూడు ఫార్మాట్లలో తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సెలక్టర్లు కొత్త కెప్టెన్‌లను నియమించారు. టెస్టులకు సారథిగా షాన్ మసూద్‌, టీ20లకు కెప్టెన్ షాహిన్ షా అఫ్రిదిని ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టు ఈనెల 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 01 , 2024 | 07:20 PM