Share News

Viral: ఇతడు నిజంగా సింహం లాంటోడే! గ్యాస్ సిలిండర్‌ నుంచి మంటలు ఎగసిపడుతుంటే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:29 PM

గ్యాస్ సిలిండర్ నుంచి ఎగసిపడుతున్న మంటలను ఓ వ్యక్తి ధైర్యంగా అదుపు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడి ధైర్యం చూసి జనాలు షాకైపోతున్నారు. సింహం లాంటి వాడంటూ కామెంట్ల వరద పారిస్తున్నారు.

Viral: ఇతడు నిజంగా సింహం లాంటోడే! గ్యాస్ సిలిండర్‌ నుంచి మంటలు ఎగసిపడుతుంటే..

ఇంటర్నెట్ డెస్క్: జనసమ్మర్దం అధికంగా ఉండే మార్కెట్లలో అగ్నిప్రమాదం జరిగితే ఆస్తి ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి చోట్ల మంటలు చెలరేగగానే జనాలు బెంబేలెత్తిపోతారు. ప్రాణాలు చేతపట్టుకుని అక్కడి నుంచి పరుగు తీస్తారు. సమస్యను పరిష్కరిద్దామని ప్రయత్నించే వారు అరుదుగా మాత్రమే ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ (Viral) అవుతోంది. ప్రాణాపాయం ఉన్నా అతడు లెక్కచేయకుండా వ్యవహరించిన తీరు జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Viral: రూ.70 లక్షల క్యాష్‌తో లగ్జరీ షాపులోకి వెళ్లిన మహిళ ఏం చేసిందో చూస్తే..


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి నెట్టింట ఈ వీడియోను షేర్ చేశారు. అతడి ఇన్‌‌స్టా అకౌంట్లో ఇలాంటి వీడియోలు అనేకం ఉన్నాయి. ఇక తాజా ఘటనలో గ్యాస్ సిలిండర్‌ నుంచి ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఓ వ్యక్తి కనీవినీ ఎరుగని సాహసం చేశాడు. తొలుత సిలిండర్‌లోంచి మంటలు చెలరేగిన విషయం గమనించిన వెంటనే జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మరోవైపు, మంటలు క్షణక్షణానికీ తీవ్రమవుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి.

ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. మరో వ్యక్తి సాయంతో అతడు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గాయాలైనా అతడు లెక్కచేయలేదు. ఎలాగొలా కష్టపడి చివరకు ఆయన సిలిండర్ నాబ్‌ను కట్టేసి మంటలను అదుపు చేశాడు. భారీ నష్టం జరిగేలోపే పరిస్థితిని చక్కదిద్దాడు.


ఇక రోడ్డు మీద వచ్చేపోయేవారు ఆ వ్యక్తి సాహసం చూసి నోరెళ్లబెట్టారు. అతడి ప్రయత్నానికి చప్పట్లతో మద్దతు తెలిపారు. పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట కూడా తెగ వైరల్ అవుతోంది. అతడి సాహసానికి జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మంటలను ఆర్పిన వ్యక్తిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ల వరద పారించారు. ఇలాంటి ధైర్యవంతులే సమాజానికి అవసరం అని కొందరు అన్నారు. అంతటి ప్రమాదంలోనూ అతడి మొహంలో కొంచెం కూడా కంగారు లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించిందని కొందరు వ్యాఖ్యానించారు. ఎందరో ప్రాణాలను కాపాడిన అతడు నిజంగా గ్రేట్ అని, సింహం లాంటి ధైర్యం అతడి సొంతమని వ్యాఖ్యానించారు. జనాలను అమితంగా ఆకర్షిస్తున్న ఈ వీడియోకు ఏకంగా 41 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - Aug 24 , 2024 | 05:36 PM