Share News

Viral: ఈ వెయిటర్ ముఖంలో సంతోషం చూడండి.. కస్టమర్ ఇలా సర్‌ప్రైజ్ చేస్తాడని ఊహించక..

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:38 PM

అవతలి వాళ్ల కోసం మనం చేసే చిన్న చిన్న పనులే కొండంత సంతోషం కలిగిస్తాయని చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ హోటల్ కస్టమర్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయిన వెయిటర్ ఉదంతం ఇది.

Viral: ఈ వెయిటర్ ముఖంలో సంతోషం చూడండి.. కస్టమర్ ఇలా సర్‌ప్రైజ్ చేస్తాడని ఊహించక..

ఇంటర్నెట్ డెస్క్: అవతలి వాళ్ల కోసం మనం చేసే చిన్న చిన్న పనులే కొండంత సంతోషం కలిగిస్తాయని చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఓ హోటల్ కస్టమర్ (Customer) ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయిన వెయిటర్ (Waiter) ఉదంతం ఇది. ఆకాశ్ సెలవరసు అనే స్కెచ్ ఆర్టిస్ట్ (Sketch Artist) పంచుకున్న ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఆకాశ్ ఇటీవల ఓ రోజు ఓ రెస్టారెంట్‌‌కు వెళ్లాడు. అక్కడ ఓ వెయిటర్ కష్టపడి పనిచేస్తుండటం చూశాడు. దీక్షగా పనిచేస్తూ, ఖాళీ దొరికినప్పుడు కాసింత విరామం తీసుకుంటూ ఉన్న అతడిపై ఆకాశ్ దృష్టి పడింది. వెయిటర్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న ఆకాశ్ వెంటనే తన చేతిలోని బిల్లుపై ఆ వెయిటర్ ముఖాన్ని చిత్రించాడు. అతడినే జాగ్రత్తగా పరిశీలిస్తూ అద్భుతమైన స్కెచ్ వేశాడు (Sketch artist surprises waiter with his sketch).

Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..

1.jpg


ఆ తరువాత అకస్మాత్తుగా వెయిటర్ వద్దకు వెళ్లి బిల్లును చేతిలో పెట్టాడు. తొలుత ఆకాశ్ ఏం చేస్తున్నాడో అర్థంకాక కాస్త అయోమయానికి గురైన వెయిటర్ క్షణకాలం పాటు బిల్లును చూశాడు. ఆ వెంటనే అతడి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఇంతసేపు అక్కడ కూర్చున్న ఆకాశ్ తన చిత్రాన్ని గీశాడని తెలిసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అంతేకాదు, ఆ ఫొటోను మురిపెంగా తన గుండెలకు హత్తుకోవడమే కాకుండా తోటి వెయిటర్లకు కూడా గర్వంగా చూపించాడు. ఆకాశ్ ఇదంతా రికార్డు చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

అనేక మంది ఆకాశ్‌ను ప్రశంసించారు. అతడు చేసిన ఈ చిన్న పని కారణంగా వెయిటర్ ఆ రోజంతా సంతోషంగా గడిపి ఉంటాడని, తన కష్టాల్ని మర్చిపోయి ఉంటాడని చెప్పుకొచ్చారు. అవతలి వారి మనసు తేలిక పరిచే ఇలాంటి చర్యలకు విలువకట్టలేమని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 09:43 PM