Viral: రైల్లో పనిచేయని ఏసీ! ప్యాసెంజర్‌కు టిక్కెట్టు డబ్బులు రిఫండ్!
ABN , Publish Date - Jul 28 , 2024 | 09:17 PM
స్వీడెన్‌లో రైలు పనిచేయకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ భారతీయురాలికి రైల్వే వాళ్లు టిక్కెట్టు డబ్బుల్లో సగం తిరిగిచ్చేసిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. జవాబుదారీతనం అంటే ఇదీ అంటూ జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు రైలు ప్రయాణాలంటే ఎన్నో మధుర స్మృతులు మరికొన్ని పీడకలలూ గుర్తొస్తాయి. లయబద్ధంగా వెళ్లే రైల్లో ప్రయాణం జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని అద్భుత అనుభవాన్ని మిగులుస్తుంది. ఇక నాణేనికి మరోవైపున అవసరానికి తగినన్ని రైల్లు లేకపోవడం, విపరీతమైన రద్దీ, రిజర్వర్డ్ సీట్లను టిక్కెట్టు లేని ప్రయాణికులు ఆక్రమించడాలు, రాకపోకల్లో ఆలస్యం, రైలు ప్రమాదాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇక రైల్లో సరఫరా చేసే ఆహారంలో పురుగులు ఉన్న ఘటనలూ వెలుగు చూశాయి. రైల్లో ఏదైనా అసౌకర్యం కలిగితే నెట్టింట లేదా అధికారికంగా ఫిర్యాదు చేయడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని నెట్టింట ఎందరో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు భిన్నంగా ఓ భారతీయ మహిళ తన రైల్లో ఏసీ పాడై కలిగిన అసౌకర్యాన్ని టిక్కెట్టు డబ్బులో సగం వెనక్కు ఇచ్చేరాంటూ నెట్టింట చెప్పడం సంచలనంగా మారింది (Viral).
స్వీడెన్‌లో తనకు రైలు టిక్కెట్టు డబ్బులు సగం రియింబర్స్ చేశారంటూ భారతీయ మహిళ నెట్టింట చెప్పుకొచ్చింది. కొంతకాలంగా అక్కడ ఉంటున్నట్టు చెప్పుకొచ్చిన ఆమె ప్రజాసేవలు ఈ రేంజ్‌లో ఉంటే ఎంత పన్ను చెల్లించేందుకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించింది. తనకు రైల్వే నుంచి అందిన మెసేజ్ కూడా నెట్టింట పంచుకుంది. తాను ఫిర్యాదు చేయకపోయినా రియింబర్స్‌మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. ‘‘మీ రైల్లో ఏసీ పనిచేయలేదు. కాబట్టి, టిక్కెట్ డబ్బులో సగం రియింబర్స్ అవుతాయి. ఈ మేరకు ఓ వోచర్ ఇస్తాము. దీంతో, మీరో మరో టిక్కెట్టు కొనుక్కోవచ్చు. ఈ వౌచర్ మీకు ఈ మెయిల్ ద్వారా అందుతుంది’’ అన్న సందేశం తాలూకు స్క్రీన్‌షాట్‌ను ఆమె నెట్టింట పంచుకుంది (Indian Woman In Sweden Receives 50% Refund Due To Train's Broken AC).
ఈ పోస్టుకు భారతీయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏకంగా 3.3 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎంత పన్ను చెల్లించామన్నది కాదు, ఈ విలువ మేరకు పౌరసేవలు అందుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని మరో వ్యక్తి చెప్పారు. లండన్‌లో రైలు 20 నిమిషాలు ఆలస్యం కావడంతో పరిహారం తాలూకు చెక్కు తనకు ఆస్ట్రేయాలో ఉండగా అందిందని మరో వ్యక్తి చెప్పారు. జవాబుదారీతనం అంటే ఇదే అంటూ మరికొందరు కామెంట్ చేశారు. స్వీడెన్‌లో ప్రజరవాణ వ్యవస్థ సమయపాలనకు పర్యాయపదమని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.