Share News

Narayana: వైసీపీ టార్గెట్ నారాయణ.. అష్టదిగ్బంధనం!

ABN , Publish Date - Feb 09 , 2024 | 10:14 PM

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారం చేస్తోంది. ఎవరు ఏమనుకున్నా.. ఏమైపోయినా సరే మనకేంటి.. కావాల్సిందల్లా 2024 గెలుపు మాత్రమే..? ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు..

Narayana: వైసీపీ టార్గెట్ నారాయణ.. అష్టదిగ్బంధనం!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారం చేస్తోంది. ఎవరు ఏమనుకున్నా.. ఏమైపోయినా సరే మనకేంటి.. కావాల్సిందల్లా 2024 గెలుపు మాత్రమే..? ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు. ఇందులో భాగంగానే.. వైసీపీ అభ్యర్థులు ఏయే నియోజకవర్గాల్లో అయితే కొత్తవారు అయ్యుంటారో.. గెలుపు అవకాశాలు అస్సలు లేకుండా ఉంటాయో.. ఆయా చోట్ల ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకూ గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో పలువురు టీడీపీ ముఖ్యనేతలను టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత పొంగూరు నారాయణపై ఫోకస్ పెట్టింది.


ఎందుకింత రచ్చ..?

శుక్రవారం నాడు నారాయణ ఇంట్లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటి దగ్గరున్న అన్ని వాహనాలనూ తనిఖీ చేశారు. నారాయణ నివాసం, ఆస్పత్రి వద్ద పోలీసులు హడావుడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ ఇంటిని, మెడికల్ కాలేజీని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. నారాయణ సతీమణి రమాదేవిని సుదీర్ఘంగా విచారణ జరిపారు. అసలు ఎందుకు సోదాలు జరుపుతున్నారో.. ఏ విషయంలో ఇంత రచ్చ చేస్తున్నారో కనీస సమాచారం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. వైసీపీ శ్రేణులు మాత్రం నారాయణ మెడికల్ కాలేజీలో డీఆర్ఐ (డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్) రైడ్ జరిగిందని.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం చేస్తున్నాయి. లెక్కలల్లో అవకతవకలు జరగడంతో ఇదంతా జరుగుతోందని త్వరలోనే వివరాలు బయటికి వస్తాయని వైసీపీ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. నారాయణను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ భారీ కుట్రలు చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఇందుకేనా ఇదంతా..?

కాగా.. 2019 ఎన్నికల్లో నారాయణపై వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ పోటీచేసి అతి తక్కువ మెజార్టీతోనే గట్టెక్కారు. అయితే ఈ ఎన్నికల్లో (2024) కూడా నారాయణ టీడీపీ అభ్యర్థిగా దాదాపు కన్ఫామ్ అయ్యారు. ఈసారి అనిల్ ఇక్కడ్నుంచి పోటీచేయట్లేదు. నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఎండీ ఖలీల్‌ను వైసీపీ బరిలోకి దింపుతోంది. కొత్త వ్యక్తి, ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కావడంతో.. నారయణను బలహీనపరచడానికి ఇలా టార్గెట్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2024 | 10:23 PM