Share News

AP Politics : స్టార్ట్.. కెమెరా.. పాలిటిక్స్.. వైసీపీలోకి వీవీ వినాయక్.. పోటీ ఎక్కడినుంచంటే..?

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:33 PM

Director VV Vinayak Joining YCP : సినీ రంగానికి (Film Industry).. రాజకీయ రంగానికి (Politics) విడదీయరాని అనుబంధమున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీనటులు.. రాజకీయాల్లో రాణించారు. ఎంజీఆర్ (MGR), జయలలిత (Jayalalitha), ఎన్టీఆర్ (NTR) లాంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా.. ఏపీ మంత్రిగా రోజా (Roja) సేవలందిస్తున్నారు. ఇలా ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా.. ముఖ్యమంత్రులుగా ఎదిగారు..

AP Politics : స్టార్ట్.. కెమెరా.. పాలిటిక్స్.. వైసీపీలోకి వీవీ వినాయక్.. పోటీ ఎక్కడినుంచంటే..?

సినీ రంగానికి (Film Industry).. రాజకీయ రంగానికి (Politics) విడదీయరాని అనుబంధమున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీనటులు.. రాజకీయాల్లో రాణించారు. ఎంజీఆర్ (MGR), జయలలిత (Jayalalitha), ఎన్టీఆర్ (NTR) లాంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా.. ఏపీ మంత్రిగా రోజా (Roja) సేవలందిస్తున్నారు. ఇలా ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా.. ముఖ్యమంత్రులుగా ఎదిగారు. ఇందులో కొందరు రాజకీయ పార్టీలు స్థాపించారు కూడా. ఎన్టీఆర్ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం మనం చూశాం. అందుకే ఎన్నికలు వస్తే చాలు.. రాజకీయ పార్టీలన్నీ సినీ రంగం వైపు చూస్తుంటాయ్.. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లుగా కూడా తీసుకెళ్తుంటాయ్. ఇక అసలు విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 2024 ఎన్నికలు (AP Elections 2024) జరగబోతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ్ల్లో సందడి మొదలైంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కోసం మూడో కంటికి తెలియకుండా ఖర్చీఫ్ వేయగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌ (Director VV Vinayak) కూడా రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్ఠాన్ని పరిశీలించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. రీల్ లైఫ్‌లో స్టార్ట్, కెమెరా, యాక్షన్ అన్న వినాయక్.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో స్టార్ట్, కెమెరా, పాలిటిక్స్.. అంటున్నారట.


VV-Vinayak.jpg

ఇదీ అసలు కథ..!

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో గట్టిగా సీట్లు కొట్టిన పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కాపు సామాజిక వర్గమే ఉంటుంది. దీంతో గత ఎన్నికల్లో కాపులకు లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ (YSRCP).. ఏ మాత్రం వారిని ఉద్ధరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని కాపు నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ లీడర్లకు నియోజకవర్గ ఇంచార్జుల బాధ్యతలు కట్టబెట్టిన జగన్ సర్కార్.. ఇటీవలే మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని (Ambati Rayudu) పార్టీలో చేర్చుకోగా.. అతి త్వరలోనే కాపుఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు (Mudragada Padmanabham) కండువా కప్పాలని హైకమాండ్ భావిస్తోంది. కాపు అనే కార్డు కనిపిస్తే చాలు కండువా కప్పేయడానికి వైసీపీ రెడీగా ఉంది. ఎలాగైనా సరే.. కాపు ఓట్లను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు జగన్. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ను వైసీపీలో చేర్చుకోవాలని హైకమాండ్ సన్నాహాలు చేస్తోందట. వినాయక్‌ది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ల. రాజకీయాల్లో అంటే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తుండటం, పలు సందర్భాల్లో వైఎస్ జగన్ రెడ్డి (YS ) ఆకాశానికెత్తేయడం లాంటివి వీవీ చేశారు. పైగా.. ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు కూడా వినాయక్ అత్యంత ఆప్తుడే. ఇవన్నీ ఒక ఎత్తయితే డైరెక్టర్ ఫ్యామిలీకి కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డిని నేరుగా కలిసే చొరవ కూడా వీవీకి ఉంది.


VV-Vinayak-And-Jagan.jpg

గతంలోనే అనుకున్నా..!

వాస్తవానికి వినాయక్‌ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు రావడం కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ (Mega Family) అంటే ఈయనకు విపరీతమైన అభిమానం. చిరు ‘ప్రజారాజ్యం’ (Prajarajyam) పార్టీ స్థాపించినప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా ఎందుకో అడుగులు పడలేదు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రారంభించిన ‘జనసేన’లో (Janasena) చేరతారని కూడా టాక్ నడిచింది కానీ అదీ జరగలేదు. ఇక 2014 ఎన్నికల్లోనే నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున జగన్.. పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి కానీ.. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియట్లేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరోసారి వీవీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇన్నిరోజులు వైసీపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన ఆయన.. ఇప్పుడు అధికారికంగా సీఎం జగన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. మరోవైపు.. జగన్ పిలుపు మేరకే వినాయక్ వైసీపీలో చేరుతున్నారని.. ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని తాడేపల్లి నుంచి వచ్చిన స్పష్టమైన హామీతో కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

VV-Vinayak-And-Kodali-Nani.jpg

పోటీ ఎక్కడ్నుంచి.. ఎలా..?

వైసీపీలో చేరిన తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కాకినాడ లేదా ఏలూరు పార్లమెంట్ స్థానాలు.. వీలుకాని పక్షంలో పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. ఈ మూడు నియోజకవర్గాలే ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎంపీ కోటగిరి శ్రీధర్ తాను పోటీ చేయనని అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. ఇక కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆమెను అదే నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా జగన్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో కాకినాడ లేదా ఏలూరు పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి వినాయక్‌ను పోటీచేయించాలని వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నారని తెలిసింది. అందుకే తిన్నగా ప్రచారం కూడా షురూ చేస్తున్నారట. ఈ మధ్యనే స్వగ్రామం తాడిపూడిలో ఆయన పర్యటించగా.. వైసీపీ నేతలు ఘన స్వాగం పలకడం, ర్యాలీలు నిర్వహించడం.. ప్రత్యేకంగా భేటీ కావడంతో ఇదంతా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి.. వినాయక్ మనసులో ఏముంది..? జగన్ పిలుపుతో పార్టీలో చేరుతారా.. లేకుంటే సినిమాలకే పరిమితం అవుతారా అన్నది వేచి చూడాలి.

VV-Vinayak-with-YSRCP-Leade.jpg

Updated Date - Jan 05 , 2024 | 07:33 PM