Share News

Jyotiraditya Scindia: అయోధ్యకు తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్.. సింధియా పచ్చజెండా

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:13 PM

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం దగ్గరపడుతున్న తరుణంలో అయోధ్య నుంచి కోల్‌కతా, బెంగళూరును కలుపుతూ ప్రయాణించే తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లయిట్‌ ను కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.

Jyotiraditya Scindia: అయోధ్యకు తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్.. సింధియా పచ్చజెండా

లక్నో: అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Temple) ప్రతిష్ఠాపన కార్యక్రమం దగ్గరపడుతున్న తరుణంలో అయోధ్య నుంచి కోల్‌కతా, బెంగళూరును కలుపుతూ ప్రయాణించే తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ (Air India Express flight)ను కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.


అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరిన యూపీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌‍లో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కిందని సింథియా ఈ సందర్భంగా ప్రశంసించారు. భారతదేశ ప్రగతికి భరోసాగా యూపీ నిలిస్తోందని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో అందరూ దీపావళి జరుపుకొన్నారని, తమ రాష్ట్రం (మధ్యప్రదేశ్)లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం దీపావళి జరుపుకొన్నారని, ఇప్పడు మరో దీపావళి జనవరి 22న (అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన) వస్తోందని అన్నారు.


యూపీలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లయిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కోల్‌కతా-అయోధ్య మధ్య తొలి ఫ్లయిట్‌కు బోర్డింగ్ పాస్‌ను యోగి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని, యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఈ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తోందని అన్నారు. నాలుగైదేళ్ల క్రితం అయోధ్యలో విమానాశ్రయం నిర్మిస్తారని ఏ ఒక్కరూ అనుకోలేదని, అయితే అది ఈరోజు సాకారమైందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో కొత్త విమానాశ్రయాలతో పాటు నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీంతో ఎయిర్ కనెక్టివిటీలో కీలక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మారిందన్నారు. డిసెంబర్ 30న మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి ప్రధానమంత్రి ప్రారంభించారని, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ విమానాల తర్వాత, అయోధ్య-కోల్‌కతాను కలుపుతూ విమాన సర్వీసు ఈరోజు నుంచి ప్రారంభమైందని చెప్పారు.

Updated Date - Jan 17 , 2024 | 07:34 PM