Share News

PM Modi: డీఎంకే లూటీలకు ముకుతాడు వేస్తాం..

ABN , Publish Date - Mar 04 , 2024 | 09:34 PM

ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన ధనాన్ని అధికార డీఎంకే లూటీ చేస్తే చూస్తూ ఊరుకోమని, దానిని బీజేపీ కక్కించి ప్రజల కోసం వెచ్చిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

PM Modi: డీఎంకే లూటీలకు ముకుతాడు వేస్తాం..

చెన్నై: ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన ధనాన్ని అధికార డీఎంకే (DMK) లూటీ చేస్తే చూస్తూ ఊరుకోమని, దానిని బీజేపీ (BJP) కక్కించి ప్రజల కోసం వెచ్చిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. తమిళనాడు అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఇది మోదీ గ్యారెంటీ అని అన్నారు. చెన్నైలో సోమవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, లబ్దిదారుల అకౌంట్లకే నేరుగా కేంద్రం నిధులు జమ చేస్తోందని చెప్పారు. ఇది డీఎంకే వాళ్లకు సమస్యగా ఉందని చెప్పారు. ప్రజల సొమ్ములను లూటీ చేయనిచ్చేది లేదని, ఒకవేళ చేసినా తిరిగి వసూలు చేస్తామని వాళ్లకు (డీఎంకే) తాను చెప్పదలచుకున్నానని అన్నారు.


తుఫాన్ సమయంలోనూ...

తమిళనాడులో గత డిసెంబర్‌లో తుపాను వచ్చినప్పుడు కూడా "ఫుడ్ మ్యానేజిమెంట్‌''కు బదులుగా మీడియాను మ్యానేజ్ చేయడంపైనే డీఎంకే దృష్టి పెట్టిందని మోదీ ఆరోపించారు. ప్రజలకు సాయపడడానికి బదులుగా మరిన్ని సమస్యలు సృష్టించిందని అన్నారు. ఇళ్లల్లోకి నీళ్లు చేరుకుంటే అంతా సజావుగానే ఉందని డీఎంకే చెబుతూ వచ్చిందని తెలిపారు. తానెప్పుడు తమిళనాడు వచ్చినా రాష్ట్రంలోని కొందరు మనస్తాపానికి గురవుతున్నారని డీఎంకేను ఉద్దేశించి ఆక్షేపణ తెలిపారు. బీజేపీ పాపులారటీ పెరుగుతుండటమే దీనికి కారణమని అన్నారు. ''చెన్నైకు నేను వచ్చిన ప్రతిసారి ప్రజలను చూసి నాలో కొత్త ఎనర్జీ వస్తుంటుంది. సిటీలో ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతిభ, వాణిజ్యం, సంప్రదాయాలకు ఇదొక పుట్టినిల్లు (హబ్). భారతదేశ అభివృద్ధిలో చెన్నై ప్రజల భూమిక చాలా కీలకం'' అని మోదీ ప్రశంసించారు.

Updated Date - Mar 04 , 2024 | 09:34 PM