Share News

Bihar: ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు: మోదీ

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:08 AM

ఈవీఎంలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధాని మోదీ అన్నారు. తీర్పును స్వాగతించారు.

Bihar: ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు: మోదీ

ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ!

  • విపక్ష నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

  • ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు

  • ముస్లింల ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ,ఓబీసీల రిజర్వేషన్లు దొంగిలించే యత్నం

  • బిహార్‌ ప్రచారంలో మోదీ

ప్రతిపక్షాలకు చెంపదెబ్బ!

అరారియా/ముంగేర్‌ (బిహార్‌), ఏప్రిల్‌ 26: ఈవీఎంలను అనుమానించిన ప్రతిపక్ష నేతలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బిహార్‌లోని అరారియా, ముంగేర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు.


ఈ సందర్భంగా ఆయన సుప్రీం తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం’’ అని వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్ష పార్టీలు తమకు ఎంతో ఇష్టమైన ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మళ్లించడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని.. ఇది మోదీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. దేశ వనరులపై తొలి హక్కు పేదలకే ఉంటుందని స్పష్టం చేశారు.

బిహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఇతర ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకొని.. పేదలు, వెనకబడిన వర్గాలు, దళితుల ఓటు హక్కును హరించేవారని ఆరోపించారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత వారి ఆటలు సాగడం లేదన్నారు. అందుకే ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ముస్లింలకు కాంగ్రెస్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని, ఇండీ కూటమి తీరును తేటతెల్లం చేయడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారని మోదీ చెప్పారు. తనను భయపెట్టాలని చూడొద్దని హెచ్చరించారు. ‘25 ఏళ్లుగా నన్ను భయపెట్టాలని చూస్తూనే ఉన్నారు. కానీ, విఫలమయ్యారు’ అని చెప్పారు.


గూగుల్‌ యాడ్స్‌లో బీజేపీ టాప్‌!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: గూగుల్‌, యూట్యూబ్‌లలో ప్రచారానికి భారీగా ఖర్చుపెట్టిన పార్టీల్లో పాలక బీజేపీ ముందుంది. రూ.100 కోట్లను దాటేసిన భారతీయ పార్టీగా గుర్తింపు పొందింది. 2018 మే 31 నుంచి 2024 ఏప్రిల్‌ 25 నడుమ ఆయా పార్టీలు రాజకీయ ప్రకటనలపై పెట్టిన ఖర్చు వివరాలను ‘ఇండియాటుడే’ చానల్‌ తెలియజేసింది. గత ఆరేళ్లలో ‘రాజకీయ’ ప్రకటనల రూపంలో గూగుల్‌కు రూ.390 కోట్ల ఆదాయం లభించింది.

ఈ మొత్తంలో బీజేపీ వాటా 26ు. ఆ పార్టీ రూ.101 కోట్ల ఖర్చు చేసింది. గూగుల్‌ యాడ్స్‌, గూగుల్‌ డిస్‌ప్లే-వీడియోపై రూ.45 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. తమిళనాడు పాలక పార్టీ డీఎంకే గూగుల్‌ యాడ్స్‌ వ్యయంలో రూ.42 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రూ.16.6 కోట్లు ఖర్చుచేయడం గమనార్హం. ఇక బీఆర్‌ఎస్‌ నిరుడు నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకే గూగుల్‌లో ప్రకటనలపై వ్యయం చేసింది. రూ.12 కోట్లకుపైగా ఖర్చుచేసినా ఎన్నికల్లో ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ స్థాపించిన ఐ-ప్యాక్‌.. ఆంధ్రలో వైసీపీ తరఫున గూగుల్‌ యాడ్లకు ఈ ఆరేళ్లలో రూ.6.4 కోట్లు, బెంగాల్లో టీఎంసీ కోసం రూ.4.8 కోట్లు ఖర్చుచేసినట్లు డేటా చెబుతోంది.

Updated Date - Apr 27 , 2024 | 03:08 AM