Share News

Chennai: టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి, ఆటో డ్రైవర్‌ సహా ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:51 AM

మదురై జిల్లా మేలూరు సమీపం కీళ్‌వలైపు ప్రాంతం వద్ద విదేశాల్లో వ్యాపారం చేసే యువకుడిపై గుర్తు తెలియిని దుండగులు టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ యువకుడు, ఆటోడ్రైవర్‌ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Chennai: టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి, ఆటో డ్రైవర్‌ సహా ముగ్గురికి గాయాలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మదురై జిల్లా మేలూరు సమీపం కీళ్‌వలైపు ప్రాంతం వద్ద విదేశాల్లో వ్యాపారం చేసే యువకుడిపై గుర్తు తెలియిని దుండగులు టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ యువకుడు, ఆటోడ్రైవర్‌ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా... కీళ్‌వలైపు ప్రాంతానికి చెందిన నవీన్‌కుమార్‌ (30) తరచూ విదేశాలకు వెళ్ళి వ్యాపార లావాదేవీలు జరుపుతున్నాడు. స్థానికంగాను కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కీళ్‌వలైపు బస్టాండు వద్ద నవీన్‌కుమార్‌ తన కారులో కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా హఠాత్తుగా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి చేసి పారిపోయారు.

బాంబు పేలుడు సంఘటనలో నవీన్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బస్టాండు సమీపంలోని ఆటోస్టాండు వద్ద నిలిచిన ఆటో డ్రైవర్‌ కన్నన్‌, ఆ ప్రాంతంలో జిరాక్స్‌ దుకాణం నడుపుతున్న సత్యమూర్తి (40) గాయపడ్డారు. బాంబు దాడిలో కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సమాచారం తెలుసుకుని కీళ్‌వలైపు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నవీన్‌కుమార్‌ ప్రత్యర్థులు బాంబుదాడికి పాల్పడినట్లు వెల్లడైంది. పరారైన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 11:51 AM