Share News

Snowfall: మంచులో చిక్కుకున్న కశ్మీర్‌, హిమాచల్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:45 AM

చలిగాలులతో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లను మంచు దుప్పటి కప్పేస్తోంది.

 Snowfall: మంచులో చిక్కుకున్న కశ్మీర్‌, హిమాచల్‌

రోడ్లపై దట్టంగా మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 28: చలిగాలులతో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లను మంచు దుప్పటి కప్పేస్తోంది. దట్టంగా కురుస్తున్న మంచు రోడ్లపై అంగుళాల మేర పేరుకుపోతోంది. దీంతో, ముందుకు కదల్లేక వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కాజీగుండ్‌ ప్రాంతంలో శ్రీనగర్‌-జమ్మూ హైవేపై 2వేలకు పైగా వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో సోలాంగ్‌ నాలా మార్గంలో వెయ్యికి పైగా వాహనాలు, 5వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పోలీసులు రోడ్లపై మంచును తొలగించి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సహాయచర్యలు కొనసాగుతున్నాయి. మంచు కారణంగా శ్రీనగర్‌-లేహ్‌, శ్రీనగర్‌-జమ్మూ హైవేలను మూసివేశారు. గుల్‌మార్గ్‌లో మంచులో చిక్కుకుపోయిన పలువురు పర్యాటకులను సైనికులు కాపాడారు. చలిగాలులు, మంచు కారణంగా కశ్మీర్‌ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీల్లో పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఇక, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఐదు జిల్లాల్లో విపరీతమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో పంజాబ్‌, యూపీ, బిహార్‌, జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌, చండీగఢ్‌, ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ఉష్ణోగ్రతలు 3-5డిగ్రీల మేర పడిపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చలి కారణంగా హరియాణాలో పాఠశాలలకు జనవరి 1 నుంచి 15వరకు సెలవులు ప్రకటించారు.

Updated Date - Dec 29 , 2024 | 03:45 AM