Share News

Electoral Bonds: బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే..

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:30 AM

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) తీరును సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించి తీరాల్సిందేనని.. ఎంపిక చేసిన అరకొర సమాచారం ఇస్తే కుదరదని తేల్చిచెప్పింది. ఈసారి ఇచ్చే వివరాల్లో.. బాండ్లను కొన్నవారికి, వాటిని

Electoral Bonds: బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే..

  • అరకొర సమాచారం ఇస్తే కుదరదు..

  • ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఫైర్‌’ఎల్లుండి సాయంత్రం ఐదింటిలోగా

  • అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం

  • చట్టం చేతులు చాలా పొడుగని వ్యాఖ్య

  • యునిక్‌ నంబర్ల వెల్లడిపై తీర్పు వాయిదా

  • వేయాలని అసోచాం, ఫిక్కీ, సీఐఐ విజ్ఞప్తి

  • వారి అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం

  • ప్రధానమంత్రి హఫ్తా వసూలీ యోజన

  • ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్‌ ధ్వజం

  • ఐటీ, ఈడీ దాడుల తర్వాత బాండ్లు కొన్న

  • తెలుగు కంపెనీల పేర్లు చెప్పిన జైరామ్‌

న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) తీరును సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం తప్పుపట్టింది. బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించి తీరాల్సిందేనని.. ఎంపిక చేసిన అరకొర సమాచారం ఇస్తే కుదరదని తేల్చిచెప్పింది. ఈసారి ఇచ్చే వివరాల్లో.. బాండ్లను కొన్నవారికి, వాటిని అందుకున్న రాజకీయ పార్టీలకు మధ్య సంబంధాన్ని బయటపెట్టే యునిక్‌ నంబర్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వడంలో ఎస్‌బీఐ జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), సీపీఎం, సిటిజన్‌ రైట్స్‌ ట్రస్ట్‌(సీఆర్టీ)లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ కలిపి.. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్‌ బాండ్‌ నంబర్లతో సహా అన్ని వివరాలనూ ఎస్‌బీఐ ఈసీకి ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఈమేరకు ఏ వివరాన్నీ దాచకుండా, తమ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని వెల్లడించినట్టుగా పేర్కొంటూ గురువారం (మార్చి 21) సాయంత్రం 5 గంటల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌, ఎండీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్‌ 11 దాకా జారీ అయిన బాండ్ల వివరాలను కూడా సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి ధర్మాసనం తిరస్కరించింది. అలాగే.. ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ తాము ఇచ్చిన తీర్పుపై సుమోటోగా సమీక్ష జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆదిష్‌ సి అగర్వాలా చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రచారం కోసం చేసే ఇలాంటి పనులను తాము అనుమతించబోమని జస్టిస్‌ చంద్రచూడ్‌ తేల్చిచెప్పారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా.. ఆ లేఖ పూర్తిగా అవాంఛనీయమని ఆయన పేర్కొన్నారు. అయితే.. బాండ్ల వివరాలు కోరుతూ కోర్టును ఆశ్రయించినవారు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉద్దేశపూర్వకంగా కోర్టును ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని.. బాండ్లకు సంబంధించి అంకెలను వక్రీకరించి చూపుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. వాటిని నియంత్రించాలని కోరారు. దీనికి సీజేఐ.. ఒక వ్యవస్థగా చట్టం చేతులు చాలా పొడవైనవేనని.. కానీ, న్యాయమూర్తులుగా తాము రాజ్యాంగం ప్రకారం ప్రకారం తీర్పులు ఇస్తామని, రూల్‌ ఆఫ్‌ లా ప్రకారమే నడుచుకుంటామని.. తాము ఇచ్చిన ఆదేశాల అమలు జరుగుతోందా లేదా అన్నదే తమకు ముఖ్యమని.. ఒకసారి తీర్పు ఇచ్చాక అది ప్రజల సొత్తు అని, దానిపై చర్చలు జరపవచ్చన్నారు. తాము కూడా సోషల్‌ మీడియాలో కామెంట్లకు అతీతులం కాదన్నారు.

అలా ఎలా అడుగుతారు?

ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాయిదావేయాలని కోరుతూ అసోచాం, ఫిక్కీ, సీఐఐ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. వాటి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ.. బాండ్ల పథకం ప్రవేశపెట్టినప్పుడు దాతల గోప్యతను కాపాడతామని చెప్పారని, అలాంటిది ఇప్పుడు ఆ వివరాలు ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. దీనికి ధర్మాసనం.. ఆ వివరాలను బయటపెట్టాలంటూ 2019 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఆ విషయం అందరికీ తెలుసని, దాతలకు కూడా తెలుసని.. తెలిసే ఇచ్చారని పేర్కొంది. అందుకే తాము కూడా ఆ రోజు నుంచీ పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించి పూర్తివివరాలు ఇవ్వాలని ఆదేశించాం తప్ప.. అంతకు ముందు జారీ అయిన బాండ్ల వివరాలను అడగలేదని గుర్తుచేసింది.

అందుకే ఇవ్వలేదు..

ఎన్నికల బాండ్ల వివరాలను ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్నకు.. ఒక్కో పార్టీ ఒక్కోరకంగా వివరణ ఇచ్చాయి. కొన్ని పార్టీలు ఆయా బాండ్లు తమకు కొరియర్‌లో ఊరూ పేరూ లేకుండా వచ్చాయని, వాటిని సొమ్ము చేసుకున్నాం తప్ప వాటిని పంపిందెవరో తమకు తెలియదని చెప్పగా.. మరికొన్ని పార్టీలు చట్టంలో ఉన్న నిబంధనలను అడ్డుపెట్టుకుని ఆ వివరాలను సమర్పించలేదు. ప్రజాప్రాతినిధ్యచట్టం నిబంధనల ప్రకారం తాము డోనర్ల వివరాలు వెల్లడించట్లేదని బీజేపీ పేర్కొంది.

పీఎం వసూలీ యోజన..

ఎన్నికల బాండ్ల పథకాన్ని కాంగ్రెస్‌ పార్టీ.. ‘ప్రధాన మంత్రి హఫ్తా వసూలీ యోజన’గా అభివర్ణించింది. అంటే ప్రధానమంత్రి మామూళ్ల వసూలు పథకం అని అర్థం. సీబీఐ, ఈడీ, ఐటీ దర్యాప్తును ఎదుర్కొంటున్న 21 సంస్థలు.. బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు సమర్పించాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పి.శరత్‌చంద్రారెడ్డిని మనీలాండరింగ్‌ కేసులో 2022 నవంబరు 10న ఈడీ అరెస్టు చేస్తే.. నవంబరు 15న ఆ సంస్థ రూ.5 కోట్ల విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థపై 2023 డిసెంబరు 20న ఐటీ దాడులు జరిగితే.. 2024 జనవరి 11న ఆ సంస్థ రూ.40 కోట్ల విలువైన బాండ్లు కొన్నట్టు తెలిపారు. 2023 నవంబరులో రెడ్డీ్‌సల్యాబ్స్‌కు చెందిన ఉద్యోగిపై ఐటీ దాడులు జరిగాయని.. ఆ తర్వాత ఆ కంపెనీ రూ.62 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు.

Updated Date - Mar 19 , 2024 | 07:44 AM