Share News

INDIA bloc Maha Rally: సింహాన్ని ఎంతోకాలం జైలులో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

ABN , Publish Date - Mar 31 , 2024 | 02:52 PM

అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.

INDIA bloc Maha Rally: సింహాన్ని ఎంతోకాలం జైలులో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఒక 'సింహం' (Lion) అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' (I.N.D.I.A.) బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో ఆదివారం జరిగిన మహార్యాలీలో 28 పార్టీలకు చెందిన కీలక నేతలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీపై సునీతా అగర్వాల్ నిప్పులు చెరిగారు. జైలులో నుంచి తన భర్త పంపిన సందేశాన్ని, దేశ ప్రజలకు ఇచ్చిన 6 హామీలను వేదిక నుంచే ఆమె చదివి వినిపించారు.


''మీ కేజ్రీవాల్ మీ కోసం జైలు నుంచి ఒక సందేశం పంపారు. సందేశం వినిపించే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. నా భర్తను మన ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు పంపారు. ప్రధాని చేసినది సరైన పనేనా? కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, నిజాయితీ పరుడని మీరు విశ్వసిస్తున్నారా? ఈ బీజేపీ వాళ్లు కేజ్రీవాల్ జైలులో ఉన్నారని, రాజీనామా చేయాలని అంటున్నారు. ఆయన రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ ఒక సింహం. వాళ్లు ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేరు'' అని సభికులను ఉద్వేగించి ఉద్వేగంగా సునీత ప్రసంగించారు. ఈరోజు తాను ఓట్లు అడగడానికి రాలేదని, ఒకరిని గెలిపించమనో, ఓడించమనో అడగడం లేదని, నవభారత నిర్మాణానికి మద్దతివ్వాలని మాత్రమే తాను ఈరోజు కోరుతున్నానని అన్నారు.


దేశానికి కేజ్రీవాల్ 6 గ్యారెంటీలు

ఈ దేశ ప్రజలకు కేజ్రీవాల్ 6 గ్యారెంటీలు ఇస్తున్నారని, పేద ప్రజలందరికీ ఉచిత విద్యుత్, దేశంలోని ప్రతి మొహల్లాకు మొహల్లా క్లినిక్‌ల నిర్మాణం వంటివి ఆ హామీలని చెప్పారు. ''ఇండియా కూటమికి మీరు బాధ్యత అప్పగిస్తే, భవ్యమైన భారతదేశాన్ని మేము నిర్మిస్తాం. నేను (కేజ్రీవాల్) మీకు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాను. దేశ వ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ కల్పనకు ఏర్పాట్లు చేస్తాం. పేదలందరికీ ఉచిత విద్యుత్ ఇస్తాం. ప్రతి గ్రామంలో అత్యద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామ, మొహల్లాలో మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాం. దేశ పౌరులందరికీ ఉచిత వైద్య చికిత్స అందిస్తాం. ఎంఎస్‌పీకి అనుగుణంగా రైతుల పంటలకు తగిన ధర చెల్లిస్తాం. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్రి కల్పిస్తాం'' అని కేజ్రీవాల్ గ్యారెంటీల సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ చదవి వినిపించారు.


మదర్ ఇండియా విలవిల్లాడుతోంది.. దౌర్జన్యం పనిచేయదు

భరతమాత విలవిల్లాడుతోందని, దౌర్జన్యం ఎంతమాత్రం పనిచేయదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. తన భర్తకు పుష్కలంగా ఆశీస్సులు అందుతున్నాయని అన్నారు. ఢిల్లీ ప్రజలు గత 75 ఏళ్లుగా అన్యాయాలకు గురవుతున్నారని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంచి ఆసుపత్రులు, విద్యతో సహా 6 గ్యారెంటీలను ఇండియా కూటమి అమలు చేస్తుందని చెప్పారు.


మహార్యాలీలో హేమాహేమీలు

ఇండియా కూటమి మహార్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పీడీపీ నుంచి మొహబూబా ముఫ్తీ, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, ఎన్‌సీపీ (ఎస్‌సీపీ) నుంచి శరద్ పవార్, ఎన్‌సీ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 02:54 PM