Share News

J&K Formula-4 Racing: వావ్.. జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్!

ABN , Publish Date - Mar 17 , 2024 | 09:41 PM

ఆదివారం జమ్మూకశ్మీర్ తొలిసారిగా ఫార్ములా - 4 ఈవెంట్‌కు శ్రీనగర్ వేదిక అయ్యింది.

J&K Formula-4 Racing: వావ్.. జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి అందాలకు పేరు గాంచిన జమ్మూకశ్మీర్ ప్రస్తుతం వడివడిగా ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో (J and K) తొలిసారిగా ఫార్ములా - 4 (Formula - 4) ఈవెంట్ శ్రీనగర్ (Srinagar) వేదికగా జరిగింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి టూరిజం శాఖ (Tourism Department) ఆధ్వర్యంలో దాల్ సరస్సు (Dal Lake) తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకూ 1.7 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ ఈవెంట్ నిర్వహించారు.

J&K Elections: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎపుడో చెప్పిన సీఈసీ

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సాగిన కార్యక్రమంలో పలువురు ప్రొఫెషనల్ ఫార్ములా - 4 డ్రైవర్లు పాల్గొన్నారు. దూసుకుపోతున్న కార్లను వీక్షించేందుకు యువత పోటీపడ్డారు. డ్రైవర్లు కార్లతో చేసిన వివిధ రకాల స్టంట్లు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం ఫార్ములా - 4 డ్రైవర్లు యువతతో మాట్లాడారు. కార్లు, రేసింగ్‌కు సంబంధించి అనేక అంశాలు వారితో చర్చించి యువతలో కార్ల రేసింగ్‌‌పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.


పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. తొలిసారిగా జరిగిన ఈ రేసుకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రహదారులను చదును చేసి, గొయ్యలు లేకుండా, రేసింగ్‌ను అనుకూలంగా తీర్చిదిద్దారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాక్ వెంబడి వైద్య బృందాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక వ్యవస్థలు, భద్రతా సిబ్బందిని మోహరించారు. డ్రోన్‌లతో రేసు మొత్తాన్ని జాగ్రత్తగా గమనించారు.

ఈ కార్యక్రమం కేవలం కార్ల రేసులు, పోటీ మాత్రమే కాదని ఈవెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఐక్యతను, ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే తత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమమని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో మోటార్‌స్పోర్ట్స్ రంగంలో కశ్మీర్ గుర్తింపు సాధిస్తోందని అన్నారు. ఫార్ములా - 4 డ్రైవర్ల స్ఫూర్తితో యువత ఈ రంగం వైపు పెద్ద సంఖ్యలో మళ్లుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 09:58 PM