Share News

Delhi: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలో చెప్పండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:26 AM

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమి చేయాలో చెప్పాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Delhi: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలో చెప్పండి

  • ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఆ ఎన్నికను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని కోరుతూ వక్త, రచయిత శివ్‌ ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నోటీసులు ఇచ్చింది. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు మళ్లీ అదే నియోజకవర్గంలో ఐదేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.


ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ చంద్రచూద్‌, జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణ వాదనలు వినిపించారు. ఇటీవల సూరత్‌లో బీజేపీ అభ్యర్థి పోటీ లేకుండా ఎన్నికైన అంశాన్ని గుర్తు చేశారు. ‘‘ఇది సరైన పద్థతి కాదు. పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహించాలి.

బీజేపీ అభ్యర్థిని తమ నాయకుడిగా ఎన్నుకోవడం ఇష్టంలేని వారు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులో భాగంగా నోటాకు ఓటేసేవారేమో! సూరత్‌లో నోటాను చెల్లుబాటు అయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైంది‘‘ అని వాదించారు. ఇది ఎన్నికల ప్రక్రియ కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతుందో వినాల్సిన అవసరం ఉందంటూ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 03:26 AM